ఫిరాయింపుల బలం మీద ఆధారపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అనుభవించే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపుగా 30 మంది .. తాము తృణమూల్‌లోకి వస్తామని.. మమతా బెనర్జీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. కొంత మంది బహిరంగంగా.. మరికొంత మంది సీక్రెట్‌గా సందేశాలు పంపుతున్నారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ సహా… అనేక మంది జాబితా ఇప్పుడు.. దీదీ ముందు ఉంది. మమతా బెనర్జీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే.. వారంతట వారు తృణమూల్‌లోకి వచ్చేందుకు సిద్ధమవడమే.. ఇక్కడ అసలు రాజకీయం.
బీజేపీ నేతలుగా ఇప్పుడు చెలామణి అవుతున్న వారంతా.. ఒకప్పుడు.. టీఎంసీ నేతలే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో అత్యధికులు టీఎంసీ నేతలే. ఈకారణంగా చాలా మంది తిరిగి వస్తామని కబురు చేస్తున్నారు. వరు ఇలా తిరిగి రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. బెంగాల్లో ఎప్పుడూ రాజకీయ ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది. అక్కడ నెట్టుకు రావాలంటే అధికారం ఉండాలన్న భావనలో ఉన్నారు. మమతా బెనర్జీ గట్టిగా పోరాడుతూండటంతో.. కేంద్రంలో ఉన్న అధికారం.. రాష్ట్ర రాజకీయాల్లో చెలాయించడానికి అవకాశం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేలు దీదీ వైపు చూస్తున్నారు.
అయితే తాము పార్టీలోకి వస్తామని కబురు చేస్తున్న వారందర్నీ పార్టీలో చేర్చుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. పార్టీ కష్టకాలంలో వదిలి పెట్టి వెళ్లిపోయిన వారిపై ఏ మాత్రం ఆమె సానుభూతి చూపించడం లేదు. బీజేపీ బెదిరింపులకు భయపడి వెళ్లినా… వ్యక్తిగత విమర్శలు చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వారినే చేర్చుకోవాలని అనుకుంటున్నారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్.. దీదీని ఎప్పుడూ… వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఈ కారణంగా ఆయనను చేర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో బీజేపీ సగం ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లోపు మరింతగా బీజేపీని దెబ్బకొట్టాలని మమతా బెనర్జీ గట్టి పట్టుదలతో ఉన్నారు.