బెంగాల్లో రాజకీయాలు హఠాత్తుగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా అటాకింగ్ మోడ్‌లో వెళ్లిన బీజేపీ.. .దీదీ విసిరిన ఒకే ఒక్క పాచికకు… డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో తన కాలుకు దెబ్బతగిలిందని ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు.. కాలికి కట్టు కట్టుకుని వీల్ చైర్లోనే ప్రచారం చేస్తున్నారు. ఆమెకు సానుభూతి వెల్లువలా వస్తుందని బీజేపీ కంగారు పడుతోంది. అందుకే ఆమెపై దాడి జరగలేదని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అనుకున్నంతగా ఎఫెక్ట్ రాలేదు. చివరికి ఈసీతోనూ అదే చెప్పించగలిగారు. దాడి జరగలేదని ప్రమాదమేనని… ఈసీ కూడా తేల్చినట్లుగా మీడియాకు ప్రకటనలు ఇచ్చింది. అయినప్పటికీ దీదీ ఎక్కడా తగ్గడం లేదు. అధికారం కోసం తనను చంపడానికి కూడా సిద్ధపడుతున్నారని ఆమె దూకుడుగా విమర్శలు చేస్తూ… ప్రచారం కొనసాగిస్తున్నారు.
దీదీ దూకుడుతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె కుట్ర సిద్ధాంతాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలియక కంగారు పడుతున్నారు. గాయాన్ని అడ్డు పెట్టుకుని కుట్ర రాజకీయాలుచేయవద్దంటూ బీజేపీ నేతలు బతిమాలుతున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఎప్పుడూ ఎదురు దాడి చేసే అమిత్ షా అయితే.. తన హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని…తాను కుట్ర అనిచెప్పానా అంటూ బహిరంగసభలో ప్రశ్నించడంతోనే బీజేపీకి కౌంటర్ ఇవ్వలేని స్థితికి చేరిందని అర్థమైపోయింది. ఈ పరిస్థితిని మమతా బెనర్జీ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆమె వీలైనంత వరకూ వీల్ చైర్లోనే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పుడు బీజేపీకి మరో రకమైన సమస్యలు కూడా చుట్టుముట్టాయి. భారతీయ జనతా పార్టీలో మొత్తం తృణమూల్ నేతలే ఉన్నారు. సీబీఐ కేసుల్ని బూచిగా చూపి చేర్చుకున్న వారే కాకుండా… టిక్కెట్లు దక్కని వారు.. పార్టీలో ప్రాధాన్యం లేని వాళ్లు.. సినీ తారలు ఇలా పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకున్నారు. వారికి ఇచ్చిన హామీల ప్రకారం… టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో ఎప్పటి నుండో బీజేపీలో ఉన్న వారు కిందా మీదా పడుతున్నారు. వీరీని కంట్రోల్ చేయలేక బీజేపీ సీనియర్లు తంటాలు పడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ… దూకుడుగా ఉన్న బీజేపీ పరిస్థితి ఒక్క సారిగా తిరగబడటం… రాజకీయ విశ్లేషకుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.