బెంగాల్లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయాల్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలుపొందాల్సిన పరిస్థితుల్లో భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రచారం హోరాహోరీగా సాగింది. ఉద్రిక్తతలు కూడా ఏర్పడ్డాయి. అయితే అంత హోరాహోరీ ఏమీ లేదని అక్కడి ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. మమతా బెనర్జీకి 58వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏ దశలోనూ బీజేపీ అభ్యర్థి పోటీ ఇవ్వలేదు.
గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ సీఎం హోదాలో పోటీ చేయడంతో అత్యధిక మెజార్టీ వచ్చింది. భవానీపూర్‌తో పాటు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు శంషేర్‌గంజ్, జాంగిపూర్లలోనూ తృణమూల్ అభ్యర్థులు వ ిజయం సాధించారు. అక్కడ కూడా భారీ మెజార్టీలను తృణమూల్ అభ్యర్థులు సాధించారు. శంషేర్‌గంజ్‌లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.
బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ విజయం తర్వాత బెంగాల్లో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున తృణమూల్‌లో చేరికలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఎదురు దెబ్బలు తగిలించే అవకాశం ఉంది.