రాజకీయంగా నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ నేత అంశంపై కాస్త స్పష్టత వచ్చింది. ఇక విపక్ష పార్టీలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏనే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని బీజేపీకి ప్రత్యామ్నాయం. కానీ యూపీఏ ఎక్కడో ఉంది. అతుకుల బొంత పార్టీలు.. ప్రధాని నేనంటే నేనని పోటీ పడే నేతలు… రాష్ట్రాల్లో బలహీనపడుతున్న పార్టీలు… ఇలాంటి అనేక అవలక్షణాలు యూపీఏకి ఉన్నాయి. అయితే.. ఇలాంటి వాటన్నింటికీ.. సమర్థ నాయకత్వం పరిష్కారం చూపుతుంది. ప్రస్తుతం యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. ఆమె పార్టీ వ్యవహారాలే చూసుకోలేపోతున్నారు. అనారోగ్యం కారణంగా.. రాహుల్ వైరాగ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు.
దాంతో యూపీఏ పరిస్థితి కూడా అంతే తేడాగా ఉంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ విజయం తర్వాత… ఇతర పార్టీల్లోని బలమైన నేతలు కూడా.. మమతా బెనర్జీ నాయకత్వానికి అంగీకారం తెలిపే పరిస్థితి వచ్చింది. యూపీఏ చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీని నియమిస్తే… మోడీకి ధీటైన నేత వచ్చారన్న అభిప్రాయం.. ప్రత్యామ్నాయం ఉందన్న ఆలోచన దేశ ప్రజల్లో కలుగుతుందన్న అభిప్రాయం.. సీనియర్లలో ఉంది. ఇప్పటికి యూపీఏలో పదికిపైగా పార్టీలు ఉన్నాయి. తాజాగా.. తమిళనాడులోనూ కాంగ్రెస్ కూటమి పార్టీ అధికారం దక్కించుకుంది. మోడీని ఢీకొట్టగలరు… అని నిర్ధారించుకున్న తర్వాత … టీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీలు కూడా.. యూపీఏలో చేరడానికి అవకాశం ఉంది.
బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న పార్టీలు.. కేవలం భయం కారణంగానే ఉంటున్నాయి కానీ.. రాజకీయంగా తమకు లాభం అని కాదని ఇప్పటికే విశ్లేషణలు ఉన్నాయి. బెంగాల్లో … కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపుల దగ్గర్నుంచి .. గవర్నర్ రాజకీయాల వరకూ అన్నింటినీ ఎదిరించి..మోడీపై గెలిచిన దీదీ… యూపీఏ నాయకత్వ సమస్యకు పరిష్కరమని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి.. మోడీకి అంత పోటీ ఇవ్వగలుగుతారు.