సాధారణ ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బీజేపీతో సున్నం పెట్టేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరును అనుమానించారు. బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరపాలని కోర్టుల వరకూ వెళ్లారు. కానీ.. ప్రయోజనం లేకపోయింది. ఇక ఎన్నికలు జరుగుతున్నప్పుడు… ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయన ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసేవారు. అచ్చంగా ఇప్పుడు అవే సీన్లు.. బెంగాల్లోనూ రిపీట్ అవుతున్నాయి. మమతా బెనర్జీ.. అధికారంలో ఉండి కూడా.. కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. కేంద్ర బలగాలు..బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని.. రిగ్గింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు అప్పట్లో అలా హడావుడి చేయడం వల్ల ఆయన ఓడిపోతున్నారని అందుకే.. .కారణాలు వెదుక్కుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా ప్రజల్లోనూ.. ఓ రకమైన భావన ప్రారంభమైంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా… ఏ మాత్రం తగ్గకుండా హడావుడి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. దీంతో బీజేపీ నేతలు మరింత మెరుగ్గా మైండ్ గేమ్ ఆడుతున్నారు. మమతా బెనర్జీ ఓడిపోతున్నారని అందుకే.. ఇలా కారణాలు వెదుక్కుంటున్నారని అంటున్నారు. మమతా బెనర్జీ ఇంకోనియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ప్రారంభించారు.
ప్రస్తుత రాజకీయాల్లో మైండ్ గేమ్ కీలకంగా మారింది. ప్రజలను భావోద్వేగాల పరంగా… ట్యూన్ చేసినప్పుడే… విజయం దక్కుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలే కీలకంగా మారాయి. దానికి పార్టీల అధినేతలు వ్యవహారశైలి కూడా ముఖ్యమే. అప్పట్లో చంద్రబాబు… ఈసీపై ఆరోపణలు చేసి.. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఓడిపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.ఇప్పుడు అదే తప్పును.. చంద్రబాబు చేస్తున్నారు.