లోక్ సభ ఎన్నికల ముందు నుంచే బీజేపీ, బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల్లో హింస జరిగినప్పుటికీ కమలం పార్టీకి 18 స్థానాలు రావడంతో పాటు ఓడిపోతారనుకున్న బాబుల్ సుప్రీయోతో పాటు పలువురు నేతలు విజయం సాధించడం బెంగాల్ బీజేపీకి కొత్త ఊపిరినిచ్చింది. బీజేపీ పరపతి పెరిగిపోవడంతో మమత తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఆమె ప్రకటనల తీరు కూడా అలాగే కనిపిస్తోంది. మమత అసహనాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ అన్ని కోణాల్లోనూ తన ప్రయత్నాలను సాగిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతలు లోపించాయని, ఆస్పత్రిలో వైద్యులపై దాడిని కూడా అదే కోణంలో పరిగణించాల్సి ఉంటుందని బీజేపీ అంటోంది. బెంగాల్ శాంతి భద్రతలపై గవర్నర్ త్రిపాఠి, అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బీజేపీ దాన్ని ఆహ్వానించడం కూడా ఈ దిశగానే చూడాలి. పైగా గవర్నర్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంపై కూడా మమత అభ్యంతరం చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్ర జాబితా అంశమైనప్పుడు గవర్నర్ ఎలా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారని మమత నిలదీసే ప్రయత్నం చేశాయి.దీనిపై ఆమెకు సానుకూల స్పందన వచ్చినట్లు కూడా కనిపించలేదు.
వైద్యుల సమ్మెలో తృణమూల్ కాంగ్రెస్‌లోనూ, మమత కుటుంబంలోనూ చీలిక తేవడంతో ఆమె వ్యతిరేకులు విజయం సాధించారు. బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం తనయ డాక్టర్ షాబా హకీం.. తృణమూల్ కార్యకర్తల తీరును తప్పుపట్టారు. వైద్యులు శాంతియుత నిరసన చేస్తుంటే చెదరగొట్టేందుకు గూండాలు ప్రయత్నిస్తున్నారని షాబా హకీం ఆరోపించారు. ఆస్పత్రుల్లోకి గూండాలు ప్రవేశించి వైద్యులను కొడుతున్నారని ఆమె అన్నారు. ఇది సిగ్గుచేటైన అంశమని ఆమె వ్యాఖ్యానించారు. ఇక మమత మేనల్లుడు అబేష్ కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం తృణమూల్ కాంగ్రెస్‌కు మింగుడు పడని అంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు సమ్మెకు సంఘీభావం చెప్పడమే ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారాస్త్రమైంది.
మమత మొండి వైఖరి వైద్యుల్లో తీవ్ర నిరసనకు కారణమవుతోంది. అవసరమైతే రాజీనామా చేసి వైదొలుగుతామని ప్రభుత్వ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 300 మంది ప్రభుత్వ వైద్యులు రాజీనామా పత్రాలు పంపినట్లు సమాచారం. దానితో మమతను ఇబ్బంది పెట్టే దిశగా అగ్నికి ఆజ్యం పోసేందుకు బీజేపీ కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు వెనుకాడకూడదని మమత బెనర్జీకి కేంద్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ లేఖ రాశారు. ఇలాంటి లేఖలు మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు మమత బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కాలంలో పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించాలని కూడా కోరుతున్నారు.
మమతపై ముప్పేట దాడి మొదలైనట్లే కనిపిస్తోంది. వైద్యుల సమ్మెను పరిష్కరించడంలో ఆమె విఫలమైనట్లు వామపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అందుకే బీజేపీ, వామపక్షాలు కలిసిపోయాయని దుమ్మెత్తి పోసేందుకు మమత వెనుకాడటం లేదు. ఇప్పుడు అపర్నా సేన్ వ్యాఖ్యల రూపంలో మమతను కొత్త తలనొప్పి వచ్చి పడింది. మమత క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె అంటున్నారు. దీనితో వివిధ వర్గాల్లో మమత పట్ల వ్యతిరేకత పెరుగుతోందన్న వాదన బలపడుతోంది. మరి ప్రస్తుతానికి పంతాలు పట్టింపులకు పోకుండా మమత రాజీ మార్గాన్ని పాటిస్తారో లేదో చూడాలి. ఈ రౌండ్లో మాత్రం బీజేపీ పైచేయిగా నిలిచింది. తృణమూల్ బాగా వెనుకబడిపోయిందని చెప్పడంలో సందేహించాల్సి అవసరం లేదు.