అదేంటీ… దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు జరిగితే, అక్కడ విచారణ జరిపిస్తామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడమేంటీ? సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయాలిగానీ, తామే ఆ పని చేసేస్తామని ఒక రాష్ట్రం ముందుకు రావడమేంటీ? అచ్చంగా ఇదే పని చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఢిల్లీ అల్లర్లపై ఆమె మాట్లాడుతూ… ఇవి ఒక పథకం ప్రకారం జరిగిన ఊచకోతగా అభివర్ణించారు! అల్లర్లను నియంత్రించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఢిల్లీ పెద్దల ఉదాసీన వైఖరి వల్లనే ఇది జరిగిందన్నారు. ఈ అల్లర్లను కేంద్రం ఎలా తీసుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. దీనిపై టీఎంసీ నేతలతో ఒక కమిటీని వేస్తున్నామనీ, ఆ బృందం ఢిల్లీలో పర్యటించి వాస్తవాలను వెలుగులోకి తెస్తుందన్నారు.
మమతా ఇలాంటి సంచనల వ్యాఖ్యలు చేయడానికి ఓరకంగా హోం మంత్రి అమిత్ షా కారణంగా చెప్పొచ్చు. నిన్ననే ఆయన మమతను ఉద్దేశించి మాట్లాడుతూ… మత కలహాలను రెచ్చగొట్టేందుకు మమతా ప్రయత్నిస్తారనీ, ఆమె వ్యాఖ్యల వల్ల దేశానికి నష్టమని ఆరోపించారు. దానికి కౌంటర్ గా ఆమె ఇలా స్పందించారు. పార్టీకి చెందిన ఎంపీలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని కేంద్రాన్ని నిలదీస్తామని మమతా అంటున్నారు.
ఢిల్లీ అల్లర్లకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాజపాని రాజకీయంగా కార్నర్ చేయడం కోసం మమతా బెనర్జీ కూడా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి, టీఎంసీ బృందం తయారు చేసే నివేదిక ఎలా ఉంటుందో చూడాలి. దానికంటే ముందు ఢిల్లీ వెళ్లబోతున్న టీఎంసీ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురౌతాయో అదీ చూడాలి. మమతా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.