శుక్రవారం మలయాళంలో విడుదలైన ‘భ్రమయుగం’ సైలెంట్ హిట్ కొట్టింది. తొలి రోజు అక్కడ రూ.3 కోట్లకుపైగానే వసూలు చేసింది. ప్రేక్షకాదరణని దృష్టిలో ఉంచుకొన్న నిర్మాతలు ఇప్పుడు కొత్తగా స్క్రీన్స్ని పెంచుతున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమా ఇది. మమ్ముట్టి వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించారు. ఇదో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్. కథలో ట్విస్టులు, మేకింగ్ క్వాలిటీ, నటీనటుల ప్రతిభ సినిమాని నిలబెట్టాయి. కొత్తతరహా సినిమాల్ని చూడాలనుకొనేవాళ్లకు ‘భ్రమయుగం’ ఓ మంచి ఆప్షన్.
తెలుగులోనూ శుక్రవారమే విడుదల కావాలి. కానీ తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి కాలేదు. అందుకే… సినిమాని విడుదల చేయడం సాధ్యపడలేదు. ఇప్పుడు మలయాళంలో హిట్ టాక్ వచ్చింది కాబట్టి, తెలుగులోనూ వీలైనంత త్వరగా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీ జరగలేదు. ఇప్పుడు పబ్లిసిటీకీ కాస్త టైమ్ దొరికింది. గతంలో ‘కాంతార’ విషయంలోనూ ఇలానే జరిగింది. కన్నడలో విడుదలైన వారం తరవాతే… తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వారం ముందుగా విడుదలై, హిట్ టాక్ రావడంతో, తెలుగులో తొలి రోజు నుంచే వసూళ్ల వాన కురిసింది. మమ్ముట్టి సినిమాకి అదే స్థాయిలో వసూళ్లు రాకపోవొచ్చు కానీ, మౌత్ టాక్ వల్ల, సినిమా చూడాలన్న ఉత్సాహం మాత్రం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.