మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మమ్ముట్టి ఇంటర్వ్యూ..
మమ్ముట్టి గారు… తెలుగు పరిశ్రమకు మళ్ళీ స్వాగతం!
థాంక్యూ. చాలా సంవత్సరాల విరామం తర్వాత తెలుగు చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది.
ఇన్నాళ్లు తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి?
ఒకే ఒక్క కారణం… ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గలో అవకాశాలేవీ రాలేదు.
‘స్వాతి కిరణం’లో మీరు ఎలా ఉన్నారో… ఇప్పుడు అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి?
హ హ హ… అంతా భగవంతుని దయ!
మీకు తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చి ఉంటాయి. ‘యాత్ర’ చిత్రానికి సంతకం చేయడానికి గల కారణమేంటి?
ఇంతకు ముందు వచ్చిన అవకాశాల్లో సరైన పాత్రలు కనిపించలేదు. ఇందులో నా పాత్ర చాలా బావుంది. నచ్చింది. అందుకని చేశా.
మహి వి రాఘవ్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించినా.. ఆయన కొత్త దర్శకుడే. ప్రతిష్టాత్మక ‘యాత్ర’ చిత్రానికి ఆయన న్యాయం చేయగలరనుకున్నరా?
నా కెరీర్లో సుమారు 70 మంది దర్శకులను పరిచయం చేశా. మహి వి రాఘవ్ రెండు చిత్రాలు చేశారు కదా! ఆ 70 మంది లో 90 శాతం మంది దర్శకులు మలయాళంలో చిత్రాలు చేస్తున్నారు. ఇద్దరు తమిళ పరిశ్రమలో ఉన్నారు. కొత్త దర్శకులతో పని చేయడం నాకు అలవాటే.
‘యాత్ర’లో మీకు బాగా నచ్చిన అంశం ఏది?
కథ. దర్శక నిర్మాతలు నా దగ్గరికి ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. నేను రాజశేఖర్రెడ్డి పాత్ర చేయగలనని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పైగా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆలస్యం కాకుండా సినిమాలు పూర్తి చేయగల నిర్మాత. లెజెండరీ నాయకుడి పాత్ర. కాదనడానికి పెద్ద కారణాలు ఏవీ కనిపించలేదు. ‘యాత్ర’లో మహిళలు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు… ఇలా ఆయన ఎవరెవరిని కలిశారు? వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ఏమేం చేశారు? అనేది కదా.
మీరు తెలుగు సినిమా చేసి చాలా రోజులైంది. తెలుగు మాట్లాడడం కష్టమైం దా? వైయస్సార్ పాత్రలో నటించడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?
వీలైనన్ని భాషలు మాట్లాడటం నాకిష్టం. తెలుగు మాట్లాడటం పెద్ద కష్టం అనిపించలేదు. అలాగే, వైయస్సార్ బడి లాంగ్వేజ్ కాపీ చేయడానికి ప్రయత్నించలేదు. నేను నేను అనుకరించలేదు. ఆ పాత్రలో ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించా. వైయస్సార్ లా నడవడం మాట్లాడడం చూడటం కష్టమే. అది కుదరదు కూడా. నాట్ పాసిబుల్. ఆయనలా చేయాలని ప్రయత్నిస్తే సక్సెస్ కాలేము. అందుకని నా శైలిలోనే నటించాను.
పాత్ర కోసం మీరు ప్రత్యేకంగా రీసెర్చ్ చేశారా?
లేదు. దర్శకుడు మహి వి రాఘవ్ చేశాడు. చక్కటి కథ రాసుకున్నాడు. నేను నటించాను.
ఈ సినిమా కోసం వైయస్సార్ తనయుడు జగన్ ని కలిశారా?
లేదు. నేనెప్పుడూ ఆయన్ను కలవలేదు.
‘యాత్ర’లో ప్రజల సమస్యలు ప్రధాన అంశం. అవి విన్నప్పుడు మీ రాష్ట్రంలో సమస్యలు గుర్తొచ్చాయా?
ఎక్కడైనా ప్రజలు ఒక్కటే. భాషలు వేరు వేరు కావచ్చు.. కానీ పేదరికం ఒక్కటే. సమస్యలు వింటున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు చాలా ఎమోషనల్ అయ్యాను. నన్ను నేను కంట్రోల్ చేసుకుని నటించా.
తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పుకోవడానికి కారణం?
ప్రయత్న లోపం లేకుండా 100% ఎఫర్ట్స్ పెట్టి డబ్బింగ్ చెప్పాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. తెలుగులో మలయాళంలో చాలా సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఉచ్ఛారణ డిఫరెంట్ గా ఉంది.
తెలుగు సినెమాలు చూస్తుంటారా?
‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చూశా.
మళ్లీ తెలుగు సినిమా చేసేది ఎప్పుడు?
మంచి కథ, పాత్ర వస్తే తప్పకుండా చేస్తా.