మలయాళంలో సూపర్ స్టార్‌గా ఎదిగాడు మమ్ముట్టి. తెలుగులో స్వాతికిరణం సినిమా చేశాడు. ఆ తరవాత… నేరుగా ఆయన నటించలేదు. అయితే పవన్ కల్యాణ్ సినిమాలో ఆయనకు ఛాన్సొచ్చింది. ‘విలన్‌గా నటిస్తారా?’ అని అడిగారు. కానీ.. ‘నో’ అని చెప్పేశాడు. ఇదంతా ఇప్పటి మాట కాదు. చాలా కాలం క్రితం జరిగిన విషయం. దాన్ని అల్లు అరవింద్ ఇప్పుడు కొత్తగా గుర్తు చేసుకున్నారు. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ‘మమాంగం’ అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు.
”స్వాతికిరణం’ కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్ అవుతుందో లేదో అనుకున్నా. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించా. ఆయనకి ఫోన్ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా. దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. నేను ‘అడగలేను’ అన్నా. దాంతో ఆయన నవ్వుతూ పెట్టేశారు’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అరవింద్. అల్లు అరవింద్‌తో పవన్ చేసిన సినిమా ‘జానీ’, ‘జల్సా’. మరి ఈ రెండిటిలో.. మమ్ముట్టికి ఏ పాత్ర ఆఫర్ చేశారో..??