సోషల్ మీడియా పెరిగిపోయాక.. డాటా విప్లవం వచ్చిన తర్వాత మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆన్లైన్ ఫ్రాడ్స్ కన్నా.. మించి… మోసాలు జరుగుతున్నాయి. మార్ఫింగ్‌లు చేసి బెదిరించడం చాలా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే… ఆన్లైన్ ప్రొఫైల్స్‌లో అందమైన యువకుల ఫోటోలు పెట్టి… పెద్ద కుటుంబాల అమ్మాయిల్ని ట్రాప్‌లోకి లాగడం… వారి నుంచి డబ్బు దస్కం తీసుకుని ఉడాయించడం. ఇలా ఒకర్నో ఇద్దర్నో చేస్తే అది పెద్ద విశేషం కాదు కానీ.. ఏకంగా ఐదు వందల మందికి అటూఇటుగా పెద్ద కుటుంబాల అమ్మాయిల్ని ట్రాప్ చేసి… నమ్మకంగా వారి దగ్గర్నుంచి డబ్బులు, నగలు తీసుకుని ఉడాయించిన ఘనుడు ఒకడు పోలీసులకు చిక్కాడు. వెదికి.. వెదికి చివరికి పోలీసులు పట్టుకుని చరిత్ర తీసేసరికి పోలీసులు కూడా… నోరెళ్లబెట్టేంత చరిత్ర బయటకు వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాకు జోగాడ వంశీకృష్ణ సంపన్న కుటుంబం నుంచి వచ్చినా… బెట్టింగ్, గుర్రపు పందాల పిచ్చితో మొత్తం పోగొట్టుకున్నాడు. ఉద్యోగాలు రుచించక… ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి.. మోసాలు చేయడం ప్రారంభించాడు. రెండేళ్ల నుంచి దాదాపుగా ఐదు వందల మందిని ఇలా మోసం చేశాడు. కోటిన్నరకు పైగా ఇలా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సొమ్మంతా వంశీకృష్ణ గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నాడు. వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు వల వేసి పట్టుకున్నారు. చాటింగ్‌లో.. అమ్మాయిల్నీ ఇట్టే పడేయడంతో వంశీకృష్ణ నేర్పరి అని పోలీసులు చెబుతున్నారు. వంశీకృష్ణ ప్రేమ మాటల మాయలో పడి… మోసపోయిన వాళ్లలో రాజకీయ నేతల కుమార్తెలు కూడా ఎక్కువగానే ఉన్నారు.
తెలంగాణకు చెందిన ఓ ఎంపీ మనవరాలు వంశీకృష్ణ మాటల మాయాజాలానికి చిక్కుకుని పెద్ద మొత్తంలో సమర్పించుకుందని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొంత మంది ప్రముఖుల పిల్లలూ మోసపోయిన వారి జాబితాలో ఉన్నారంటున్నారు. చాలా మంది పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొద్ది రోజులుగా వరుసగా ఫిర్యాదులు వస్తూండటంతో… తీగలాగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. టెక్నాలజీ వాడకంలో రాటుదేలిపోయిన వంశీకృష్ణ.. తన గుర్తింపును దొరకకుండా.. అమ్మాయిల్ని ఎలా మోసం చేశాడో… పోలీసుల్నీ కూడా అలాగే బురిడి కొట్టించాడు. చివరికి… కాకినాడలోనే దొరికిపోయాడు.