ఎవరైనా పెళ్లి ఎందుకు చేసుకుంటారు..?. కుటుంబం ఏర్పడటం కోసం చేసుకుంటారు. వారి కోసం ఒకరుంటారని చేసుకుంటారు. కానీ కొంత మంది ఉంటారు…పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే.. అదో వ్యాపారంలా చేసుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే మరింత క్రిమినల్ మైండ్‌తో ఆలోచించాడు.. ఓ కీచకుడు. పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇలా ఒకరితో అయితే సంపాదన సరిపోదనుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఎనిమిది మందిని చేసుకున్నాడు. కానీ చివరికి పాపం పండింది.. అందరూ కలిసి వాడి సంగతి చెప్పాలనుకున్నారు. మీడియా ముందుకు వచ్చి వాడి బండారం అంతా బయట పెట్టారు. ఇది ఎక్కడో జరగలేదు.. విశాఖలో జరిగింది.
ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్న ఆ నిత్యపెళ్లి కొడుకు పేరు అరుణ్ కుమార్. గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న అరుణ్.. సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. వేరే ఎవరో అయితే ఎందుకని అనుకున్నారో కానీ.. అమాయక అమ్మాయిల్ని నమ్మకంగా మంచి మాటలు చెప్పి..మోసం చేయడం ప్రారంభించాడు. పెళ్లిచేసుకుని వ్యభిచారం చేయించడం ప్రారంభించాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు బయట పడ్డాయి.
గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు లైట్ తీసుకున్నారు. అరుణ్ కుమార్ తో కుమ్మక్కయి బాధితులకు న్యాయం చేయలేదు. దీంతోవారు మహిళా సంఘాలను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియా సమావేశం పెట్టి.. అరుణ్ కుమార్ కీచకాల్ని బయట పెట్టారు. పోలీసులు ఏ చర్యలు తీసుకోకపోవడాన్ని వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారం సంచలనం సృష్టించడంతో పోలీసుల తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.