ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు కానీ ఆ అంశం ఇప్పుడు ప్రతిపక్షపార్టీలకి అధికార తెదేపా, బీజేపీలపై దాడి చేసేందుకు మంచి బలమయిన ఆయుధంగా మారింది. అంతేకాదు తమ తమ పార్టీలను బలోపేతం చేసుకొనేందుకు రాజకీయ నేతలకు ఇదొక గొప్ప సాధనంగా ఉపయోగపడుతోంది. రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేడు మళ్ళీ రాష్ట్రంలో లేచి నిలబడగలుగుతోంది అంటే ఈ ప్రత్యేక హోదా అంశం కారణంగానే. ప్రత్యేక హోదా అంశం ఈ రాజకీయ పార్టీలకు ఏవిధంగా సహాయపడుతోందో అర్ధం చేసుకొనేందుకు ఇదే ఒక మంచి ఉదాహరణ. రాజకీయ పార్టీలు దీని వెనుక ఇమిడి ఉన్న ప్రజల సెంటిమెంటుని మరింత రాజేసి దానిని ఒక ఆయుధంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని నేతలు, పార్టీలు కూడా ఇప్పుడు హడావుడి చేయడం అందుకే.
కనుక యువకులు రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో తాము పావులు కాకుండా జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం. ఈవిధంగా ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకొంటే ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం ఏమీ లేదనే సంగతి కూడా గ్రహించాలి. ఇదివరకు తెలంగాణా కోసం 1200 మంది పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి బలిదానాలకు కించిత్ కూడా చలించలేదు. రాష్ట్ర విభజన వలన తనకు పూర్తిగా రాజకీయ ప్రయోజనం కలుగుతుందని విశ్వసించిన తరువాతనే తెలంగాణా ఏర్పాటు చేసింది తప్ప యువకులు బలిదానాలు చేసుకొంటున్నారనే బాధపడి మాత్రం కాదని గ్రహించాలి. కనుక యువకులు బలిదానాలు చేసుకోవడం వలన ప్రత్యేక హోదా రాదనే సంగతి గ్రహించాలి.
క్షణికావేశంలో యువత ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటే వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చినవారవుతారు. తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నవారి కుటుంబాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వారి బలిదానాల వలన ఇప్పుడు ఎవరు రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు? అని ఒకసారి ఆలోచించినట్లయితే, ఇటువంటి ఆలోచన కూడా తప్పేనని అర్ధమవుతుంది. తెలంగాణా కోసం ఎన్నడూ పోరాడనివారు కూడా నేడు పదవులు, అధికారం అనుభవిస్తుంటే, తెలంగాణా కోసం పోరాడినవారు, బలిదానాలు చేసుకొన్న వ్యక్తుల కుటుంబాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కనుక ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఆంద్రప్రదేశ్ యువత కూడా తెలంగాణా పోరాటాల నుండి స్ఫూర్తి పొందుతూనే, బలిదానాల ఆలోచనను కూడా దరి జేరనీయరాదు.