ఎన్నికలకు ముందు కశ్మీర్లో పుల్వామా దాడి జరిగింది. ఆ విషయం తెలిసినా.. ప్రధానమంత్రి మోడీ.. డాక్యుమెంటరీ షూటింగ్లో పాల్గొన్నారంటూ.. అప్పట్లో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. కానీ దీన్ని బీజేపీ నేతలు తోసిపుచ్చారు. చివరికి ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రసారం కాబోతోంది. నిజానికి అది డాక్యుమెంటరీ కాదు… రియాలిటీ షో.. దాని పేరు “మ్యాన్ వర్సెస్ వైల్డ్”. అడవిలో తప్పిపోతే ఎలా బతకాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం తినాలి.. ఎలా ఉండాలి.. ఇదే కాన్సెప్ట్‌తో ఈ రియాల్టీ షో రూపొందుతోంది. దీన్ని డిస్కవరీ చానల్ ఆగస్టు 12వ తేదీన ప్రసారం చేయబోతోంది.
మోడీ .. అడవిలో చేసే రియాలిటీ షో విన్యాసాలతో డిస్కవరీ చానల్ ప్రోమో విడుదల చేసింది. క్షణాల్లో ఇది వైరల్ అయిపోయింది. “మ్యాన్ వర్సెస్ వైల్డ్” షోను.. బేర్ గ్రిల్స్ అనే స్టార్ హోస్ట్ నిర్వహిస్తూంటారు. ఆయన మోడీని మరో కోణంలో ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. చాలాకాలం అడవులు, పర్వతాల్లో గడిపానని.. తన జీవితంపై వాటి ప్రభావం చాలా ఉందని మోడీ అప్పుడప్పుడూ చెబుతూంటారు. ఇప్పుడు రియాలిటీలో షో ఆ అనుభవాన్ని ఉపయోగించుకున్నారు. బేర్ గ్రిల్స్ చాలా మంది దేశాధ్యక్షులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఒబామాతోనూ ఎసిసోడ్ చేశారు.
మోడీ రియాలిటీ షో టీజర్ సూపర్‌గా ఉందన్న ప్రచారం సంగతేమో కానీ.. పుల్వామాలో సైనికులపై దాడి జరిగిన ఫిబ్రవరి 14 రోజునే .. మోదీ ఈ షూట్లో పాల్గొన్నారని విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాడి జరిగి 44మంది సైనికులు చనిపోయిన విషయం తెలిశాక కూడా మోదీ షూటింగ్ కొనసాగించారా అని ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు… సోషల్ మీడియా ఎన్ని విమర్శలు చేసినా.. అవి లెక్కలోకి రావు. మోడీ సాహసమే.. దేశ సాహసం..!