మోజో టీవీ తరహాలోనే 10టీవీని అటకెక్కించాలని కొత్త యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొంత మంది అవసరం అనుకున్న ఉద్యోగులకు టీవీ9లో సర్దుబాటు చేయడం ప్రారంభించారు. మెల్లమెల్లగా మ్యాన్‌పవర్‌ను నిర్వీర్యం చేసి.. తర్వాత మొత్తంగా కార్యకలాపాలను నిలిపివేయడమో.. లేదా.. ఎంటర్టెయిన్మెంట్ చానల్ రూపునకు తేవడమో చేయాలన్న ఆలోచన కొత్త యాజమాన్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీవీ9 యాజమాన్యం చేతుల్లోనే 10 టీవీ కూడా ఉంది. రెండు న్యూస్ చానళ్లు… చేతుల్లో ఉండటం.. రెండు కూడా నష్టాల బాటలో ఉండటంతో… రియల్ ఎస్టేట్..కాంట్రాక్ట్‌ల రంగంలో పేరు మోసిన.. యాజమాన్య పెద్దలు… ఓ దాన్ని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
నిజానికి.. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టుల రంగంలో పేరమోసిన పెట్టుబడిదారులు.. మొదట్లో.. టీవీ9నే గురి పెట్టారు. కానీ.. రవిప్రకాష్ పడనీయలేదు. ఎలాగైనా… మీడియా రంగంలోకి రావాలని.. కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న 10టీవీని గురి పెట్టారు. ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఆ టీవీని కమ్యూనిస్టు పార్టీ సులువుగానే వదిలించుకుంది. అయితే ఆతర్వాత అనూహ్యంగా మారిన పరిస్థితులతో.. టీవీ9 కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి వచ్చింది. అదే సమయంలో.. టీవీ9తో ఉన్న లింకులను చూపి.. మోజో టీవీని మూసేయించి.. ఎక్విప్ మెంట్‌ను అమ్మేశారు. ఇప్పుడు.. టెన్ టీవీ మీద దృష్టిపెట్టారని అంటున్నారు. టీవీ9 గతంలో లాభాల్లో ఉండేది. ఒక వేళ నష్టాలు వచ్చినా యాజమాన్యం భరించగలదు. కానీ టెన్ టీవీ వల్ల ఎలాంటి ఉపయోగమూ కొత్త యాజమాన్యానికి కనిపించడం లేదు.
అందుకే.. టెన్ టీవీని ఎంత వేగంగా వదిలించుకుంటే.. అంత ఎక్కువగా తమకు డబ్బులు మిగులుతాయని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో… మీడియా పెట్టుబడిదారుల్లో కొంత మంది ఓటీటీపై దృష్టి పెట్టారు. కంటెంట్ కూడా పెంచుకుంటున్నారు. అది.. ఓటీటీతో పాటు ఎంటర్ టెయిన్మెంట్ చానల్‌కు కూడా పని చేస్తుందేమోనని.. ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా టెన్ టీవీకి రూపుమార్చినా ఆశ్చర్యం లేదు. ఓ నిర్ణయం తీసుకుంటే.. చాలా వేగంగా అమలు చేస్తారు పెట్టుబడిదారులు.. నిజంగా టెన్ టీవీకి ఎర్త్ పెట్టాలనుకుంటే… రెండు, మూడు నెలల్లోనే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది.