హాలీవుడ్ క్లాసిక్స్ స్ఫూర్తిగా టాలీవుడ్ లో వచ్చినన్ని సినిమాలు మరో ఇండస్ట్రీలో రాలేదనే చెప్పాలి. వరల్డ్ సినిమా చేతికందిన తర్వాత ఇప్పుడు స్ఫూర్తి పొందాలన్నా కాపీ చేయాలన్నా కొంచెం జంకుతున్నారు కానీ ఒకప్పుడు ఉదృతంగా ఉండేవి. అయితే మోడరన్ సినిమాలో ఈ ట్రెండ్ ని ప్రారంభించిన ముళ్ళపూడి వెంకటరమణ లాంటి రచయితలు హాలీవుడ్ సినిమాని అనుకరించే విధానంలో కూడా ఒకరకమైన ఒరిజినాలిటీ వుండేది. మూలకథలోని సారాన్ని తీసుకొని ఆ సారంతో తెలుగు నేటివిటికి తగ్గట్టు కొత్తకథ రాసేవారు. సినిమా చూసినప్పుడు మూలకథ హాలీవుడ్ నుంచి తీసుకున్నారనే ఫీలింగ్ వచ్చేది కాదు.
అయితే రానురాను ట్రెండ్ మారింది. ఒక దశలో కథ, సీన్లు, పాత్రలు ఇలా అన్నీ ఎత్తేసి కాపీ పేస్ట్ లా చేసిన ట్రెండ్ కొన్నాళ్ళు నడిచింది. తర్వాత దీనికి కూడా కాలం చెల్లింది. ప్రేక్షకుల ఆ కథ, ఎమోషన్ కి కనెక్ట్ కాలేకపోయే పరిస్థితి వచ్చింది. గత పదేళ్ళుగా పరిశీలిస్తే హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిన కథ ఒక్కటీ కూడా ఇక్కడ బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా 90s హాలీవుడ్ కథలు.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పట్టడం లేదు.
ఇలాంటి సందర్భంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ‘లైఫ్ యాజ్ వుయ్ నో ఇట్’ అనే హాలీవుడ్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. అదే కథ స్ఫూర్తితో శర్వానంద్ హీరోగా ‘మనమే’ కథని రాసుకున్నాడు. ఈ రెండు కథల సెంట్రల్ ఐడియా ఒకటే. కానీ మ్యాజిక్ కుదరలేదు. నిజానికి చాలా మంచి ఎమోషన్ వున్న కథ. కానీ ఆ ఎమోషన్ తెలుగు ఆడియన్ కి పట్టేలా చెప్పలేకపోయాడు. దీనికి కారణం కూడా హాలీవుడ్90s కి ఇప్పుడు తెలుగు ఆడియన్ కనెక్ట్ అవ్వడం లేదు. ఆ రొమాంటిక్ కామెడీ ఎంతమాత్రం ఇక్కడ రుచించడం. పాయింట్ బావుంది కదా అని అదే మూసలో తీస్తే దెబ్బకొట్టేయడం ఖాయమని ‘మనమే’ ఫలితం నిరూపించింది. హాలీవుడ్90s సినిమాల స్ఫూర్తితో కథలు ఆలోచిస్తున్న దర్శక రచయితలకు ‘మనమే’ ఓ వార్నింగ్ లాంటి లెసన్ అనే చెప్పాలి.