ఎన్నికల హంగామా ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టీ సినిమాలవైపే. ఈవారం కూడా కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. ప్రేక్షకుల తీర్పు కొరుతూ ముందుకొచ్చే చిత్రాల్లో ‘మనమే’ ఒకటి. శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. యూ బై ఏ సర్టిఫికెట్ దక్కించుకొంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో కట్ చేసిన సినిమా ఇది. ఇప్పటికే శర్వా తన సన్నిహితులకు సినిమా చూపించేశాడు. వాళ్ల నుంచి చాలా పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. శర్వా చాలా స్టైలీష్‌గా, అందంగా కనిపిస్తున్నాడని, కృతి శెట్టి తన యాక్టింగ్ స్కిల్స్ తో అందర్నీ సర్ప్రైజ్ చేయనుందని, వెన్నెల కిషోర్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ ఒక ఎత్తు అంటున్నారు. చివరి 40 నిమిషాలూ వేరే లెవల్‌కు తీసుకెళ్లిందట. అక్కడ ఎమోన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని చెబుతున్నారు.
ట్రైలర్, టీజర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. పాటలు కూడా ఓకే అనిపించుకొంటున్నాయి. ఈ సినిమాలో ఏకంగా 16 పాటలు ఉండడం విశేషం. ఈమధ్య కాలంలో ఇన్ని పాటలున్న సినిమా ఏదీ కనిపించలేదు. ”పాటలన్నీ కథ చెబుతాయి. నాలుగైదు సన్నివేశాల్లో చెప్పలేని కథంతా.. ఒక్క పాటలో చూపించాను. అందుకే అన్ని పాటలొచ్చాయి” అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన సినిమా ఇది. నిర్మాణ పరంగా వాళ్లు రాజీ పడరు. శర్వా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈచిత్రాన్ని రూపొందించారు. మ్యాంగో సంస్థ నాన్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకొంది.