Manamey Movie Review
తెలుగు360 రేటింగ్ 2.5/5
శర్వానంద్ కు క్లీన్ ఇమేజ్ ఉంది. క్లాస్, లవ్ స్టోరీలకు కేరాఫ్ అయిపోయాడు. తనదైన రోజున కచ్చితంగా మంచి హిట్ కొట్టగల స్టామినా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ శర్వానంద్ సినిమా వస్తోందంటే అలెర్ట్ అవుతారు. వాళ్ల కోసం శర్వా చేసిన మరో సినిమా ‘మనమే’. టైటిల్ లో క్లాస్ టచ్ ఉంది. పాటలూ ఆకట్టుకొన్నాయి. టీజర్, ట్రైలర్లో చూపించిన విజువల్స్ హై క్లాస్‌గా అనిపించాయి. శర్వా కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా మాట్లాడాడు. ‘మంచి హిట్ కొట్టబోతున్నాం.. కావాలంటే రాసి పెట్టుకోండి’ అని అభిమానులకు మాట ఇచ్చాడు. మరి… విడుదల ముందు క్రియేట్ అయిన బజ్ ఈ సినిమాకు ఎంత వరకూ ఉపయోగపడింది? ‘మనమే’లో నిజంగానే అంత మేటర్ ఉందా?
విక్రమ్ (శర్వానంద్) ఓ ఆకతాయి కుర్రాడు. బాధ్యతలు లేని ప్లేబోయ్. సుభద్ర (కృతిశెట్టి) పద్ధతైన అమ్మాయి. ఇచ్చిన మాట మీద నిలబడే రకం. అనుకోని పరిస్థిలుల్లో వీరిద్దరూ ఖుషి (విక్రమ్ ఆదిత్య) అనే ఓ చంటి పిల్లాడికి కేర్ టేకర్స్ గా ఉండాల్సివస్తుంది. భిన్న ధృవాలైన విక్రమ్, సుభద్ర.. ఈ ప్రయాణంలో ఎన్ని తిప్పలు పడ్డారు? వీళ్ల మధ్య ప్రేమ చిగురించిందా? అసలు ఖుషి ఎవరు? తన వెనుక ఉన్న కథేమిటి? ఇదంతా మిగిలిన స్టోరీ.
‘లైఫ్ యాజ్ వుయ్ నో ఇట్’ (2010) అనే హాలీవుడ్ సినిమా ప్రభావం ‘మనమే’పై గట్టిగా ఉంది. ఆ సినిమాలోని కోర్ పాయింట్ పట్టుకొని, అందులో మనవైన ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ జోడించి రాసుకొన్న కథ ఇది. కోర్ పాయింట్ లో ఉన్న కొత్తదనం హాలీవుడ్ సినిమాకే దక్కుతుంది. దాన్ని ఎమోషన్స్, ఫన్ జోడిస్తూ ఆహ్లాదకరంగా చెప్పే ప్రయత్నం చేశాడు శ్రీరామ్ ఆదిత్య. తొలి సగంలో దాదాపు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. హీరో క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది. విక్రమ్ పాత్రలో శర్వా చేసే అల్లరి హాయిగా ఉంటుంది. తెరపై ఖుషి కంటే, విక్రమ్ అల్లరే ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో ఇద్దరు పసిపాపల్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సుభద్రగా కృతి క్యారెక్టర్ని కూడా బాగానే డిజైన్ చేశారు. వీరిద్దరూ ఎలా కలుస్తారు? అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్, పిల్లాడ్ని పెంచలేక విక్రమ్ పడే అవస్థలు నవ్విస్తాయి. మధ్యలో యాక్షన్ కోసమో, థ్రిల్ కోసమో… రాహుల్ రవీంద్రన్ పాత్రని తీసుకొచ్చారు. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. రెస్టారెంట్ అంటూ ఒకటి మొదలెట్టారు. దాన్ని మధ్యలోనే వదిలేశారు. అలా వదిలేసే పాటికి… ఆయా ఎపిసోడ్స్‌పై అంతంత టైమ్ పెట్టడం ఎందుకు?
సుభద్రకు పెళ్లి ఫిక్సయ్యిందని ముందే చెప్పేశారు. దాంతో ఈ లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఏమిటన్నది అర్థమైపోతుంది. దాంతో ఇంట్రవెల్ లో సుభద్ర ఫియాన్సీ (శివ కందుకూరి) వచ్చినా పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించదు. సెకండాఫ్‌లో కథ ఏ రీతన సాగుతుంది? చివరికి ఏమవుతుంది? అనేది ముందే తెలిసిపోతుంది. బెలూన్ ఫెస్టివల్ ని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. అక్కడ రాహుల్ రామకృష్ణతో ఫన్ చేయిస్తే బాగుండేది. ఆ స్కోప్ ఉన్నా, ఎందుకో వాడుకోలేదు. అసలు రాహుల్ రామకృష్ణ పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. తొలి సగంలో ఫన్ మూమెంట్స్ అక్కడక్కడ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్‌లో అది కనిపించలేదు. క్లైమాక్స్ లో శర్వా ఇండియా రావడం, పేరెంట్స్‌ని కలవడం, వాళ్ల ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం ఇవన్నీ హడావుడిగా సాగిపోతాయి. నిజానికి పేరెంట్స్ ఎమోషన్ ఈ సినిమాకు అవసరమైన పాయింటే. దానికి బీజం తొలి సన్నివేశం నుంచీ వేసుకొంటూ వచ్చాడు దర్శకుడు. చివర్లో బాగా ఎలివేట్ చేశాడు కూడా. కానీ అప్పటికే క్లైమాక్స్ లో ఏం జరుగుతుందన్న విఆషయంలో క్లారిటీకి వచ్చేసిన ప్రేక్షకుడు దాని గురించి ఎదురు చూస్తుంటాడు తప్ప, ఈ ఎమోషన్స్‌ని పట్టుకోడు. క్లైమాక్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఏమైనా ఉందా, అనే అనుమానాలు కలుగుతాయి. కానీ.. సింపుల్‌గా, ఎలాంటి యాక్షన్ లేకుండా ముగించడం బాగుంది.
సినిమా తొలి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ కలర్ఫుల్గా ఉంది. ఆఖరికి గవర్నమెంట్ ఆసుపత్రిని సైతం అందంగా చూపించారు. సినిమా రిచ్‌గా ఉంది. ఈ సినిమాలో 16 పాటలున్నాయి. అయితే చాలా పాటలు నేపథ్య సంగీతంలో అందర్భాగం అయిపోయాయి. అబ్దుల్ వాహబ్ చాలా అర్థవంతమైన సంగీతాన్ని అందించాడు. నేపథ్య సంగీతంలో పాటలు వాడుకోవడం బాగుంది. పాటలు ఎక్కువైన ఫీలింగ్ ఎక్కడా అనిపించదు కూడా. కొన్ని మాటలు బాగా కుదిరాయి. చివర్లో పిల్లాడ్ని చేతికందిస్తూ లవ్ ప్రపోజ్ చేసే షాట్.. చక్కగా కుదిరింది. సెకండాఫ్‌పై దర్శకుడు దృష్టి పెట్టాల్సింది. పిల్లాడి వైపు నుంచి కథ మొదలెట్టి, ఈ కథని పిల్లాడి కోణంలోనే నడిపిన దర్శకుడు… పిల్లాడు దూరమైనప్పుడు అంత ఎమోషన్ని ఎందుకు పండించలేకపోయాడో అర్థం కాదు. బహుశా.. సన్నివేశాలు రాసుకోవడంలో లోపం అయి ఉండొచ్చు.
శర్వా ఈ సినిమాలో చాలా అందంగా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ ఇవన్నీ రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. తను ప్రతి ఫ్రేమ్‌లోనూ నచ్చుతాడు. శర్వాకోసమైనా ఈ సినిమా చూడాలన్నంత బాగా తన పాత్రని డిజైన్ చేశారు. ఎమోషన్స్ పండించడంలో శర్వా దిట్ట. ఆ పార్ట్ క్లైమాక్స్‌లో వాడుకొన్నారు. ‘ఉప్పెన’ తరవాత కృతి అంత అందంగా కనిపించిన సినిమా ఇదేనేమో. తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. పిల్లాడు క్యూట్ గా ఉన్నాడు. ఓసారి ఎత్తుకోవాలన్నంత ముద్దొచ్చాడు. మిగిలిన పాత్రలేం సరిగా డిజైన్ చేయలేదు. సీరత్ కపూర్, ఆయేషా ఖాన్.. అతిథి పాత్రల్లో మెరిశారు. త్యాగాల పెళ్లి కొడుకు బాధ్యతని ఈసారి శివ కందుకూరి తీసుకొన్నాడు.
చివరిగా చెప్పాలంటే ‘మనమే’ పాస్‌బుల్ మూవీ. సరదాగా, ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉండడం, ఎక్కడా అసభ్యత లేకుండా జాగ్రత్త పడడం మెచ్చుకోదగిన అంశాలు. శర్వా 35వ సినిమా ఇది. ఈ ప్రయాణంలో ‘మనమే’ బెస్ట్ అనలేం కానీ, ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కాస్త బెటర్‌గా ఉన్న సినిమాల లిస్టులో ‘మనమే’ చేర్చొచ్చు.
తెలుగు360 రేటింగ్ 2.5/5