తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5
‘మనసుకు నచ్చింది’….
ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో అడుగుపెట్టేటప్పుడు బయట వాతావరణం ఒక్కసారి పరిశీలించి చూడండి చల్లగాలి మీతో ఏదో చెప్పాలనుకుంటుంది చుట్టూ ఉన్న చెట్లు చేతులు చాచి మరీ… మిమ్మల్ని వెనక్కి రమ్మంటుంటాయి మార్నింగ్ షోలైతే సూరీడు కూడా మీతో మాట్లాడతాడు ఫస్ట్ షో.. టైమ్ అయితే చంద్రుడు ఏవో సైగలు చేస్తాడు.
ఆ ప్రకృతి భాష మీకు అర్థం కాదు. సినిమా చూసొచ్చేంత వరకూ అదెందుకో.. ఏమిటో.. తెలియాలంటే.. అర్జెంటుగా కథలోకి వెళ్లాలి!
ఓ అబ్బాయి (సందీప్ కిషన్) ఓ అమ్మాయి (అమైరా దస్తూర్)… ఇద్దరూ బావా మరదళ్లు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ల ఫ్రెండ్షిప్ చూసి ఇంట్లో వాళ్లు ప్రేమ అని ఫిక్సయి… పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుంటారు. `మాకు ఈ పెళ్లి వద్దు బాబోయ్` అంటూ ఇద్దరూ కలసి కట్టుగా… అక్కడ్నుంచి జంప్!
గోవాలో ఇద్దరూ కలిసే ఉంటూ.. చెరొకర్ని ప్రేమించేస్తారు. తీరా.. తమ మనసులో ఉన్నది వాళ్లో వీళ్లో కాదు… తమ పక్కనున్న బావ\మనదలు అన్న సంగతి తెలుస్తుంది. ఇదీ కథ.
ఈ కథని ఇలానే తీసినా.. కనీసం మూడు రోజులైనా ఆడేది. ఈ లైన్ పట్టుకుని ఎన్ని విధాలా హింసించాలో అన్ని విధాలా హింసించేశారు. దానికి తోడు ‘ప్రకృతి ప్రేమ’ ఒకటి.
తొలి సన్నివేశాలు చూస్తే డౌటానుమానం ఒకటి కలుగుతుంది. ”మనం సినిమాచూస్తున్నామా, లేదంటే మెడిటేషన్ చేయడం ఎలా” అనే సీడీ చూస్తున్నామా? అని!
‘ఈ ప్రకృతిని ప్రేమించండి… చెట్టుతో మాట్లాడండి..’ అంటుంటే మంతెన సత్యనారాయణ ప్రవచనాల్లా అనిపిస్తుంది.
సినిమాలో, సినిమా ద్వారా, సినిమాతో ఏవో కొన్ని మంచి ముక్కలు చెప్పడం వరకూ ఓకే. కానీ దాన్ని జనాల మీద రుద్దేయ కూడదు.
ఈ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తోంది.. ”మీ ఇష్టా ఇష్టాలను మాపై రుద్దేస్తోంటే పారిపోకుండా ఉంటామా” అని.
సేమ్ టూ సేమ్ జనాల ఫీలింగ్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది.
దర్శకురాలికి ఓ పాయింట్ నచ్చింది. ప్రకృతిని ప్రేమతో మిక్స్ చేసి.. ఫ్రెండ్ షిప్‌తో కలగలిపి, మేడిటేషన్ కోటింగ్ ఇచ్చి ఓ సినిమా తీద్దామనుకుంది. ఆ పాయింట్ తనకైతే బాగా నచ్చి ఉంటుంది. అందుకే ఇంత రిస్క్ చేసింది. కానీ జనాల మాటేంటి? వాళ్లకు నచ్చుతుందా, లేదా? అనేది మాత్రం చూడలేదు.
హీరోగారిని ప్రియదర్శి నాలుగు చివాట్లు పెట్టి వెళ్లిపోయే సీన్ ఒకటి ఉంది. దాని గురించి విపులంగా చెప్పుకోవాలి. అంత గొప్ప సీన్ అని కాదు.. అంత లెంగ్త్ ఉంది అని. దాదాపు 5 నిమిషాల పాటు సాగే సీన్ అది. అందులో సందీప్ కిషన్ హావభావాలు, ఎమోషన్స్, దాన్ని పలికించే విధానం, అందులోని డైలాగులు చూడాలి నా సామి రంగ. అటు దర్శకత్వ ప్రతిభ, ఇటు నటనా… దండం పెట్టేద్దామనిపిస్తుంది. నిజానికి అక్కడి నుంచే ఈ సినిమా కాస్త జోక్‌గా మారిపోయింది.
ఆ సన్నివేశం చూస్తుంటే మాత్రం ఈ సినిమాలోని మరో డైలాగ్ ఇక్కడ వాడాలనిపిస్తుంది
”రాకపోతే రాదని చెప్పొచ్చు కదా, మాడిపోతోందిక్కడ”
ఇన్ని `క్లాసిక్` సీన్ల తరవాత ఆటోమెటిగ్గా ప్రేక్షకుడు ఇంట్రవెల్ కార్డు కోసమే చూస్తాడు. అది కనిపించినప్పుడు మాత్రం నాలుగు రోజుల క్యూలో నిలబడిన భక్తుడికి… దేవుడి దర్శనమైనంత ఆనందం కలుగుతుంది..
ఇక సెకండాఫ్…
అది చూస్తే.. దీనికంటే ఫస్టాఫే నయం అనిపించకమానదు. ఇంత వరకూ ఎలాగూ చూశారు కదా, ఇకపై కూడా చూడక చస్తారా.. అన్నట్టు సాగాయి మిగిలిన సన్నివేశాలు. ఒక్క సన్నివేశంలోనూ డెప్త్ లేదు. ఆ ప్రేమలో ఫీల్ లేదు. కాసేపు ఫొటోగ్రఫీ అంటాడు. ఇంకాసేపు ప్రకృతి అంటాడు. కాసేపు స్నేహం… ఇంకాసేపు ప్రేమ. క్యారెక్టర్లలోనే కాదు, ఈ కథలో.. రాసిన విధానంలోనూ క్లారిటీ లేకుండా పోయింది. ప్రేక్షకుడు కథకి, సినిమాకి ఎప్పుడైతే కనెక్ట్ అవ్వడో.. అప్పుడు మిగిలిన సినిమాలో ఏ పాయింట్నీ మనసులోకి తీసుకోడు. తెరపై నాజర్ సీరియస్‌గా పిట్ట కథలు చెబుతున్నా.. అదేదో జోక్‌లా అనిపించి నవ్వేస్తుంటాం. పక్కన కూర్చున్న సందీప్ కిషన్ గుక్కపెట్టి ఏడుస్తున్నా…. మనకు నవ్వాగదు. సినిమా అంతా ఇలానే తయారైంది. మంజుల ఫ్యామిలీ గోవాకి వెళ్లి.. వాళ్ల కాలక్షేపం కోసం సందీప్ కిషన్‌నీ, ఓ కెమెరాని తీసుకెళ్లి.. తమకు నచ్చిందేదో తీసేసి, తెరపై బొమ్మవేసినట్టు అనిపించిన సినిమా.. ఇది!
కథ, కథనాలు ఇంత సిల్లీగా ఉంటే తెరపై కమల్ హాసన్ కనిపించినా.. తేలిపోతాడు. సందీప్ కిషన్ ఎంత?? మామూలుగానే పిల్లాడు కాస్త ఓవర్ చేస్తుంటాడు. ఈసినిమాలో అది ఇంకాస్త ఓవర్ అయ్యింది. ఏడుపు సీన్లలో మాత్రం.. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.. `ఇక ఆపేయండి ప్లీజ్` అని. ఇద్దరమ్మాయిలు ఎర్రగా, బుర్రగా ఉన్నారు. అంతకు మించి ఏం అడక్కండి. ఓ లిప్ లాక్ సీన్ మాత్రం చూపించారు. అది చూసి తృప్తి పడిపోయి వచ్చేయాలి తప్ప.. ఎవరి నుంచి, ఇంకేం ఆశించకూడదు. రధన్ సంగీతం.. బాగానే ఉన్నట్టు అనిపించినా.. కథతో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతామో, అప్పుడే ఆ పాటల్నీ ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. కెమెరా వర్క్ మాత్రం బాగుంది. మంజుల దర్శకురాలిగా, కథకురాలిగా.. తేలిపోయింది. ఆమె అనుభవ రాహిత్యం కనిపించింది.
ఈ రివ్యూ ‘ప్రకృతి మనతో ఏదో చెప్పాలనుకుంటుంది’ అనే పాయింట్‌తో స్టార్ట్ చేశాం. అది ఏమిటి? ఎందుకు అనేది థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడే అర్థం అవుతుంది. సాధారణంగా ప్రకృతి – అందులోని రమణీయత అనే పాయింట్‌పై సాగే సినిమాలు ”కనీసం అవార్డులైనా తెస్తాయి” అనే ధీమాతో తీస్తారు. ఈ సినిమాకీ కొన్ని అవార్డులు ఇవ్వొచ్చేమో. కానీ తీసినందుకు కాదు.. చివరి వరకూ ఓపిగ్గా చూసిన ప్రేక్షకులకు.
చివరిగా ఓమాట… నచ్చింది నచ్చినట్టు తీయడం కళ.. ఆనందం. కానీ.. మనకు నచ్చింది ఎదుటివాళ్లకు నచ్చినట్టు చేయడంలో నేర్పు ఉంది. అది మంజుల ఇంకా నేర్చుకోవాలి
ఫైనల్ పంచ్: ‘ప్రకృతి బీభత్సం’
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5