నవ్వించడం అంత ఈజీ కాదు. అది కూడా ఆరోగ్యకరమైన దారిలో. ఆ నాడీ పట్టేసుకున్నాడు మారుతి. తన సినిమాల్లో కామెడీ బాగుంటుంది. క్యారెక్టరైజేషన్లు గుర్తిండిపోతాయి. తనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఆ బ్రాండే. ఇప్పుడు అదే మార్క్ తో మరో సినిమా చేశాడు. అదే… `మంచి రోజులొచ్చాయి`. శోభన్, మెహరీన్ జంటగా నటించారు. నిజానికి ఇది ఓటీటీ కోసం చేసిన సినిమా. కానీ.. ఇప్పుడు థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు టీజర్ వదిలారు.
ఓ కాలనీలో జరిగే కథ ఇది. అక్కడ కనిపించే రకరకకాల పాత్రలు.. వాటిమధ్య పండించే వినోదం – మధ్యలో కరోనా. మనుషులు విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం – ఇదీ స్థూలంగా కథ. ఈ టీజర్లో పాత్రలన్నింటినీ పరిచయం చేశాడు మారుతి. వాళ్లకు చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టాడు. ట్రెండ్ లో ఉన్న పేర్లని వాడుకోవడంతో మారుతి స్పెషలిస్టు. `డాక్టర్ బాబు`, వీరమాచినేని.. లాంటి పాత్రలకు పేరడీలు ఇందులో చూపించబోతున్నాడు. కామెడీ గ్యాంగ్ కావల్సినంత ఉంది. పైగా మారుతికి కామెడీలో మంచి పట్టుంది. సో… మారుతి లాఫింగ్ థెరపీకి రెడీ అయిపోవొచ్చిక.