నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం పై రెండు కేసులు నమోదు అయినట్లుగా చంద్రగిరి పోలీసులు ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గం లోని ఎంబీయూ యూనివర్సిటీ డైరీ ఫాం వద్ద బుధవారం చోటు చేసుకున్న గొడవ పై గురువారం రెండు వర్గాలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసు పెట్టారు. తనపై, తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయడం పై మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు పెట్టారు.
మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల గొడవల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. తన ఆస్తి తన ఇష్టం అని మోహన్ బాబు చెబుతూండటంతో మనోజ్ తాను ఆస్తి కోసం కాదని ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అంటున్నారు. జల్ పల్లి నివాసంలోనే మనోజ్ ఉంటున్నారు. వీరి గొడవల కారణంగా మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేసి హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు దాన్నుంచి బయటకు రావడానికి తంటాలు పడుతున్నారు. తాజాగా.. చంద్రగిరిలోనూ కేసులు నమోదయ్యాయి.
అయితే మోహన్ బాబు పీఏపై కేసులు పెట్టారు కానీ.. మోహన్ బాబుపై పెట్టలేదు. విష్ణుపై కూడా పెట్టలేదు. దీంతో వారు పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ మనోజ్, మౌనికలపై నేరుగా కేసులు పెట్టారు. వారు స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. మనోజ్.. కూర్చుని మాట్లాడుకుందామని అంటున్నారు కానీ.. మోహన్ బాబు మాత్రం మనోజ్ తో రాజీకి వచ్చేది లేదన్నట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు.