హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యచేసుకున్న రిషితేశ్వరిపై టాలీవుడ్ సెలబ్రిటీ మంచులక్ష్మి స్పందించారు. ఇది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ కాలంలోకూడా ర్యాగింగ్వలన ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకునేటంత పరిస్థితి ఉందంటే అది దారుణమని వ్యాఖ్యానించారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అన్నారు. తప్పుచేసినవారికి శిక్ష పడితీరాలని చెప్పారు. రిషిత తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాతకూడా కళాశాల నిర్వాహకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ర్యాగింగ్ విషయంలో ఏమాత్రం సహించకూడదని అన్నారు. మరోవైపు విద్యార్థినులకు మంచు లక్ష్మి హితోపదేశం చేశారు. ర్యాగింగ్ కన్నా ఎంతో విపత్కర పరిస్థితులు ఉన్నాయని, ర్యాగింగ్లాంటి కారణాలతో ప్రాణాలు తీసుకోవటం సరికాదని చెప్పారు. జీవితం ఎంతో విలువైనదని,ఆత్యహత్య అనేది మార్గం కాదని, జీవితంకోసం పోరాడాలని ఉద్బోధించారు.