మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. మౌనికారెడ్డి కుమారుడ్ని కూడా పెళ్లి తర్వాత తన కుమారుడిగా స్వీకరించానని మంచు మనోజ్ ప్రకటించారు. వారి కుమారుడి పుట్టిన రోజు మంగళవారం. ఈ సందర్భంగా చంద్రబాబు ఆశీస్సుల కోసమే కలిశామని మనోజ్, మౌనికా దంపతులు చెబుతున్నారు.
నిజానికి మౌనికారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నంద్యాల ఉపఎన్నికల్లో మౌనిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రెగ్నంట్ గా ఉన్నప్పటికీ విస్తృతంగా పర్యటించారు. మంచి వాగ్దాటితో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో మౌనిక సోదరుడు బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. మౌనికా రెడ్డి తర్వాత రాజకీయాల్లో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆమె సోదరి , మాజీ మంత్రి అఖిలప్రియ , సోదరుడు బ్రహ్మానందరెడ్డి మాత్రం రెండు నియోజకవర్గాల్లో చురుగ్గా టీడీపీ తరపున పని చేసుకుంటున్నారు.
మంచు మనోజ్ ఏ పార్టీలోనూ లేరు. కానీ ఇటీవల వైసీపీలో చేరొచ్చనే పుకార్లు వినిపించాయి. ఆయన తండ్రితో కలిసి గత ఎన్నికలకు ముందు కాలేజీ ముందు చేసిన హైడ్రామా కలకలం రేపింది. తర్వాత మోహన్ బాబు కూడా వైసీపీకి అంత సన్నిహితంగా లేరు. అందుకే.. మనోజ్ కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.