మంచు ఇంట్లో మళ్లీ మంటలు చెలరేగాయి. కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న గొడవలు మళ్లీ మొదలయ్యాయి. మనోజ్ మరోసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లడం, లోపలకు అనుమతి లేకపోవడంతో గేటు ముందు భైటాయించడంతో మళ్లీ మీడియా ఫోకస్ ఈ కుటుంబంపై పడింది. ఈ సందర్భంగా మనోజ్ చేస్తున్న కొన్ని కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. అదే సమయంలో మనోజ్ చేసిన మల్టీస్టారర్ (ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు) కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకొన్నారు. బాక్సాఫీసుపై మంచు సోదరుల పోటీ ఎలా ఉంటుందో చూడాలని చాలామంది ఆశించారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ‘కన్నప్ప’ వాయిదా పడింది. అయితే ‘కన్నప్ప’ లేట్ అవ్వడానికి కారణం.. టెక్నికల్ ఇష్యూస్ కాదంటున్నాడు మనోజ్. ”నా సినిమా భైరవం కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకొన్నా. నా సినిమాకు భయపడి.. విష్ణు తన కన్నప్పను వాయిదా వేశాడు” అంటూ కొత్త కారణాన్ని చెప్పాడు మనోజ్.
”నా కెరీర్లో విష్ణు కోసం చాలా త్యాగాలు చేశా. ఓ సినిమాలో లేడీ గెటప్ కూడా వేశా. బయట బ్యానర్లో హిట్టు కొట్టినప్పుడు.. వెంటనే నన్ను లాక్కొచ్చి, సొంత బ్యానర్లో సినిమా చేయమనేవారు. ఇలా ఎంత చేసినా నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్.
అటు కన్నప్ప, ఇటు భైరవం… రెండు సినిమాలకూ బజ్ లేదు. అలాంటిది.. ఒక సినిమాని చూసి మరో సినిమా భయపడిపోయి వాయిదా వేసుకోవడం ఏమిటో? అని నెటిజన్లు నవ్వుకొంటున్నారు. మొత్తానికి విష్ణు, మనోజ్ల గొడవ, వారి వైరం.. మీడియాకు కావల్సినంత ముడి సరుకు అందించాయి. ‘కన్నప్ప’ వాయిదా పడడం వల్ల ఇప్పుడు ‘భైరవం’ కూడా వాయిదా వేస్తారేమో చూడాలి.