మంచువారి వారసుడిగా వచ్చినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మంచు మనోజ్. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, కొరియో గ్రాఫర్ గా విభిన్నమైన పార్శ్వాలు, ప్రతిభలు చూపించాడు. ఇప్పుడు అహం బ్రహ్మస్మి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈరోజు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలుగు 360 తో మనోజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సంగతులు ఇవీ…
హలో… మనోజ్. హ్యాపీ బర్త్ డే. ఇలాంటి బోరింగ్ బర్త్ డే మీరు ఎప్పుడూ చేసుకోకూడదు అని కోరుకుంటున్నాము..
– (నవ్వుతూ) నిజమే. అభిమానుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవాలని నా ఆశ. కానీ కరోనా కదా. కుదరడం లేదు. మీరన్నట్టు… ఇలాంటి బోరింగ్ బర్త్ డ్ ఇంకెప్పుడూ చేసుకోకూడుదు. కానీ ఈ పుట్టిన రోజున ఓ మంచి పని చేస్తున్నా. ఆ విషయంలో సంతోషంగానే ఉంది.
ఏంటది?
– వలస కార్మికుల కోసం ఏదైనా సహాయం చేద్దామని ఫిక్సయ్యా. వాళ్ల కోసం రెండు మూడు బస్సులు మాట్లాడా. వాళ్లని వాళ్ల సొంత ఊరికి పంపాలని నిర్ణయించుకున్నా. కొంతమందైనా.. ఇంటికి వెళ్లి.. `మనోజ్ వల్ల.. నేను ఇంటికి రాగలిగా…` అని సంతృప్తిగా అంటే.. ఈ పుట్టిన రోజుకు సార్థకత చేకూరినట్టే.
లాక్ డౌన్ సమయంలో మిమ్మల్ని కలచి వేసిన సంగతేంటి?
– ఇంకేంటి? వలస కార్మికుల అవస్థలే. మనకో ఇల్లుంది. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. బుద్ధిగా ఇంట్లో ఉండండ్రా.. అంటే.. `బోర్ కొట్టేస్తోంది ఉండలేం` అని తెగ బాధ పడిపోతున్నాం. మనందరికీ ఇల్లు కట్టి.. రోడ్డుపై పడ్డారు వసల కార్మికులు. వాళ్ల బాధతో పోలిస్తే మనమెంత? మన బాధెంత? గర్భిణీ స్త్రీలు, ముసలీ ముతతా, ఎండల్లో రోడ్డు మీద నడుస్తూ ఉంటే, మనసు తరుక్కుపోతోంది. అందుకే వాళ్ల కోసం ఏమైనా చేయాలని ఫిక్సయ్యాను. బస్సుల పర్మిషన్లు సంపాదించడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. నాకు విరాళాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఇష్టం ఉండదు. పది రూపాయలు ఖర్చు పెట్టినా మన చేతులతో చేయాలి. మనం బరిలోకి దిగామంటే.. `అరే.. వాడు చూస్తున్నాడు. మన పని మనం శ్రద్ధగా చేయాలి..` అనే భయం మిగిలిన వాళ్లలో కలగాలి. అందుకే ఏ చిన్న సాయం చేసినా, నాకు నేను చేయడం అలవాటు.
అన్నీ సవ్యంగా ఉంటే ఈపాటికి `అహం బ్రహ్మస్మి` ట్రైలరో టీజరో విడుదల చేసేవారు..
– అవునండీ. కచ్చితంగా ట్రైలర్ వచ్చేసేది. పాటలన్నీ పూర్తయ్యాయి. వాటిని కూడా విడుదల చేసేవాళ్లం. నిజంగా పాటలు చాలా బాగా వచ్చాయి. ఆ పాటలన్నీ వింటుంటే.. `ఇంత మంచి పాటలు ఉంచుకుని, విడుదల చేయలేకపోతున్నాం` అనే బాధ వుంది.
అహం బ్రహ్మస్మి ఎలా ఉండబోతోంది. మంచు మనోజ్ 2.ఓని చూడొచ్చా?
– కచ్చితంగా చూడొచ్చు. నాలోని కొత్త డైమెన్షన్ అది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సినిమా చూసి మీరే చెప్పాలి.
ఏంటి అందులో స్పెషాలిటీ..?
– ఈ సినిమాలో నేను చేసిన ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇంంత వరకూ ఎవరూ చేసి ఉండరు. మళ్లీ నేనే అలాంటి ప్రయత్నం చేయనేమో. అంత కొత్తగా ఉంటాయి. నా సినిమాకి పీటర్ హెయిన్స్ మాస్టర్ పనిచేయడం ఇదే తొలిసారి. ఆయన నన్ను రకరకాలుగా నలిపేస్తున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా
ఆరు కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఈ సినిమాలో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా ఉండబోతోంది.
ఆరు కోట్టా.. అదేంటి? కరోనా వల్ల అందరూ బడ్జెట్లు తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే మీరు అంత ఖర్చు పెడుతున్నారు. ఏంటా ధైర్యం?
– మా కథని మేం అంతగా నమ్మాం. కచ్చితంగా అందుకు తగిన అవుట్ పుట్ చూస్తారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరపై ఎంత సేపు ఉంటుంది?
– ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఉంటుంది. కథకి చాలా కీలకం.
కరోనా వల్ల సినిమా పరిశ్రమ పూర్తిగా మారిపోబోతోంది.. అని అందరూ నమ్ముతున్నారు. మరి మీరేమంటారు?
– ఊహకు అందని గొప్ప మార్పులేం జరగవు. కానీ చిన్న సినిమాలకు చిన్న నిర్మాతలకూ మేలు జరుగుతుంది..
అదెలా?
– ఓటీటీ మార్కెట్ బలపడింది. చిన్న సినిమాలకు నిజంగా ఇది వరం. పెద్ద సినిమాలు ఎలాగూ థియేటర్లలో విడుదల చేసుకోవాల్సిందే. మరో మార్గం లేదు.
చిన్న సినిమాలకు మంచి రోజులు వచ్చినట్టేనా?
– కచ్చితంగా. పరిమితమైన బడ్జెట్లో సినిమాలు తీసుకుంటే ఓ టీ టీ రూపంలో మంచి రేట్లు వస్తాయి. వాటితో గట్టెక్కగలం.
ఓ టీ టీ కి అమ్ముకుంటే కుదర్దని థియేటర్ యాజమాన్యాలు గోల పెడుతున్నాయి..
– అదంతా ముసలి కన్నీరే. చిన్న సినిమాల్ని ఆదుకునడానికి ఎప్పుడైనా ఈ థియేటర్లు ముందుకొచ్చాయా? ఇప్పుడు ఓ టీ టీ కి అమ్మితే వాళ్లకొచ్చిన బాధేమిటి? మీరు ఓటీటీకి సినిమా అమ్ముకోకండి.. ఏ సినిమాకైనా ఇంత మొత్తంలో థియేటర్లు ఇస్తాం.. అని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఇన్నాళ్లు వాళ్ల రాజ్యం నడిచింది. ఇప్పుడు చిన్న సినిమాల రాజ్యం నడుస్తుంది.
ఆమధ్య సినిమాలకు దూరం అవుతానని ప్రకటించారు. సడన్ గా మనసు మార్చుకున్నారు. కారణం ఏమిటి?
– నా వ్యక్తిగత జీవితం పూర్తిగా డిస్ట్రబ్ అయ్యింది. ఆ సమయంలో సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించలేకపోయా. అందుకే ఆ నిర్ఱయం తీసుకున్నా. ఇప్పుడు అంతా కుదట పడింది. సినిమాలకు మళ్లీ దగ్గరయ్యా. సినిమా అనేది నా కన్నతల్లి. బిడ్డ తప్పు చేసినా, దూరంగా వెళ్లిపోయినా, మళ్లీ అక్కున చేర్చుకుంటుంది. నా విషయంలో అదే జరిగింది.
సినిమాలు మానేయడం ఎందుకు? అని ఎవరూ అడ్డు చెప్పలేదా? మీ నాన్నగారితో సహా…
– ఎవరూ ఏమీ అనలేదు. నా నిర్ణయాన్ని గౌరవించారు. నా బాధలు వాళ్లకు తెలుసు. అందుకే.. నాకు అడ్డు చెప్పలేదు.
ఆ విరామంలో ఏం తెలుసుకున్నారు?
– నాకు కోపం, ఆవేశం చాలా ఎక్కువ. కానీ ఈ విరామంలో నేను చాలా కామ్ అయ్యాను. నన్ను నేను అన్వేషించుకున్నాను. ప్రయాణాలు ఎక్కువ చేశాను. హిమాలయాలకు వెళ్లాను. ప్రశాంతంగా ఉండడం అభ్యసించాను.
సినిమాలకు దూరంగా ఎలా ఉండగలిగారు?
– నిజంగా నేను సినిమాలకు దూరంగా ఏమీ లేను. చాలా సినిమాల్ని చూశాను. ఇప్పుడు కూడా వెబ్ సిరీస్లను క్రమం తప్పకుండా చూస్తున్నా. వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నా.
మీదీ, ఎన్టీఆర్ దీ సేమ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ సందర్భంగా తనకేం చెబుతారు?
– ఎవరైనా హ్యాపీ బర్త్ డే అని చెబితే.. థ్యాంక్యూ చెబుతాం. అదే ఎన్టీఆర్ నాకు చెప్పినా, నేను ఎన్టీఆర్ కి చెప్పినా `సేమ్ టూ యూ` అనుకుంటాం.
ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లిస్టులో బెస్ట్ కోతి మీరే అట కదా..
– నేను కోతి అయితే తనేంటి? జింక పిల్లనా? తను నాకంటే పెద్ద కోతి. తన అల్లరి ఎవరికీ కనిపించదు.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
– ఉన్నాయి. ఎప్పటి నుంచో కలలు కంటున్న ఓ ప్రాజెక్టు…. ఇప్పుడు వర్కవుట్ అవుతోంది. త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెబుతా.
ఓకే.. ఆల్ ది బెస్ట్. వన్స్ ఎ గైన్ హ్యపీ బర్త్ డే
– థ్యాంక్యూ అండీ