జనసేనలోకి మనోజ్.. వెయ్యికార్లతో ఆళ్లగడ్డకు ర్యాలీ అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేశారు. కానీ చివరికి ఆయన వెయ్యికార్లతో వెళ్లలేదు .. కనీసం పది కార్లతో కూడా వెళ్లలేదు. తన కుటుంబంతో కలిసి వెళ్లారు. అయినా వెయ్యి కార్లలో వెళ్లడానికి ఆళ్లగడ్డలో ఏమైనా బహిరంగసభ పెడుతున్నారా.. హైదరాబాద్ జనాలతో వెళ్లి ఏం చేస్తారు అన్న కనీస లాజిక్ ఈ ప్రచారం చేసిన వారు పట్టించుకోలేదు.
మంచు మనోజ్ తన కుమార్తెను మొదటి సారిగా ఆళ్లగడ్డకు తీసుకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఆ పాపకు దేవసేన శోభ అని.. తన భార్య మౌనిక తల్లి పేరే పెట్టారు. రాజకీయంపై మనోజ్ ప్రస్తుతానికి సమయం కేటాయించే పరిస్థితుల్లో లేరు. అంతకు మించి ఆయనకు ఏపీలో ఓ నియోజకవర్గం అంటూ లేదు. కుటుంబంలో వివాదాలు రావడంతో ఆయన చంద్రగిరిలోనూ ఉండే పరిస్థితి లేదు.
మనోజ్ తో పోలిస్తే మౌనికనే దూకుడుగా ఉంటారు. ఆమె మనస్థత్వం రాజకీయాలకు సరిపోతుందని చెబుతారు. ఆమెకు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ఆమె సోదరి ఇప్పటికే రాజకీయం చేస్తున్నారు. ఆమెను కాదని వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉండవు. ప్రస్తుతం మనోజ్ దంపతులు అనేక సమస్యల్లో ఉన్నారు. వాటిని పరిష్కరించుకుని పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ రాజకీయాల జోలికి రాకుండా కెరీర్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.