మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తను వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విలన్ పాత్రలపై మోజు పెంచుకొన్నాడు. తనకు అలాంటి అవకాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ‘మిరాయ్’లో మనోజ్ విలన్ గానే దర్శనమివ్వబోతున్నాడు. ‘హనుమాన్’ తరవాత తేజా సజ్జా హీరోగా రూపుదిద్దుకొంటున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘మిరాయ్’లోని మనోజ్ పాత్రని పరిచయం చేసింది చిత్రబృందం. ఓ గ్లింప్స్ కూడా విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన బ్లాక్ స్వార్డ్ అనే తెగకు చెందినవాడిగా మనోజ్ పాత్రని చిత్ర బృందం పరిచయం చేసింది. తన లుక్ చాలా స్టైలీష్ గా ఉంది. జులపాల జుత్తూ, కళ్లజోడుతో.. మనోజ్ ఇదివరకెప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ‘మిరాయ్’ యాక్షన్‌కు పెద్దపీట వేసిన సినిమా. ఇందులో మనోజ్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో త్రీడీ ఎఫెక్ట్స్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్. ఆ పాత్రని సైతం త్వరలోనే పరిచయం చేయబోతున్నార్ట.