మంచు మనోజ్ ట్రాక్ తప్పాడు. గత కొన్నాళ్ళుగా మనోజ్ కి హిట్లు లేవు. సినిమాలు కూడా బాగా తగ్గాయి. అటాక్ , శౌర్య, గుంటూరోడు.. ఇలా అన్నీ ఫ్లాఫులే. అంతకుముందు కూడా మనోజ్ కి అదిరిపోయే హిట్ ఏమీ లేదు. ఇప్పటివరకూ దాదాపు ఇరవై సినిమా చేసుంటాడు మనోజ్. ఇందులో ప్రయాణం, వేదం లాంటి విలక్షణమైన సినిమాలు వున్నాయి. మరో రెండు ఏవరేజ్ లు కనిపిస్తాయి.
మొన్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తో వచ్చాడు మనోజ్. ఈ సినిమా ఎలా వచ్చిందో ఎలా వెళ్లిందో కూడా జనాలు తెలియని పరిస్థతి. శ్రీలంకలో తమిళుల పోరాటం, ఎల్టీటీఈ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరీ ఓవర్ సెంటిమెంట్ అయిపోయింది. పాయింట్ విలక్షణమైనదైనా దాన్ని భరించడం కష్టమైపోయింది. వెరసి.. మరో ఫ్లాఫ్.
ఇప్పడు మనోజ్ అలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. కుర్రహీరోల రేసులో వెనక బడిపోయాడు మనోజ్. నాని, నితిన్, శర్వానంద్..రాజ్ తరుణ్.. లాంటి హీరోలు తమదైన శైలిలో అలరిస్తుంటే మనోజ్ మాత్రం అక్కడే ఆగిపోయాడు. అసలు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కధను సెట్ చేసుకోవడంలో మనోజ్ విఫలమౌతున్నాడు. ఇప్పటికైనా మంచిపోయినది లేదు. తన నుండి ప్రేక్షకులు ఎలా ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఓ నిఖార్సైన హిట్ కొట్టాలి. ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ చేతిలో సినిమా ఏదీ లేదు. కొంచెం ఆలస్యమైన ఓ జనరంజకమైన సినిమాతోనే రావాలని కోరుకుందాం.