మంచు ఫ్యామిలీ ఇష్యూ డైలీ సీరియల్ లా నడుస్తోంది. మనోజ్ కి విష్ణుకి ఆస్తి పంపకాల్లో ఏవో తగాదాలు వున్నాయి. మోహన్ బాబు విష్ణు పక్షంలో వున్నారు. ఈ ఇష్యూ బయట ప్రపంచానికి ఇలానే ప్రొజెక్ట్ అయ్యింది. తన ఇంటి దగ్గర జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ ని కొట్టి ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునే పరిస్థితి మోహన్ బాబుకి వచ్చింది. ఆ ఉదంతం తర్వాత మోహన్ బాబు సైలెంట్ అయిపోయారు. విష్ణు, మనోజ్ ట్విట్టర్ లో ర్యాంగింగ్ చేసుకున్నారు. తర్వాత విష్ణు కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు కేవలం మనోజ్ మాత్రమే తన ఆత్మగౌరవం పోరాటం అంటూ తిరుగుతున్నాడు.
తాజాగా మీడియాకి ఓ వీడియో వదిలాడు మనోజ్. ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతిలో కోట్లు రూపాయలు ఇచ్చి వారి మనుషులతో తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మళ్ళీ విష్ణు, మోహన్ బాబుపై ఆరోపణలు చేశాడు మనోజ్. బోగస్ కేసులు పెట్టారని, బౌన్సర్లతో స్టూడెంట్స్పై దాడి చేయిస్తున్నారని, రిసార్ట్స్‌లో రాబోయే సినిమా గురించి డిస్కషన్ చేస్తుంటే.. పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురి చేశారన్నారని, సోమవారం రాత్రి తన విషయంలో జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తన వద్దనున్న ఆధారాలను ఎస్పీకి అందజేస్తానని చెప్పుకొచ్చాడు మనోజ్.
అంతేకాదు.. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తానేదో భయపడుతున్నానని అనుకుంటున్నారేమోనని.. ఈ జన్మలో అది జరగదని ఓ వార్నింగ్ టైపు స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు మనోజ్.
ఇది పూర్తిగా ఫ్యామిలీ గొడవని అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం మనోజ్ ఒక్కడే ఈ విషయంలో తరుచూ మాట్లాడుతూ మీడియా ముందు కనిపిస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ విషయంలో మీడియా ఆసక్తి కూడా తగ్గిపోవడం గమనించవచ్చు. దీనికి కారణం కూడా మనోజే.
మనోజ్ ప్రతిసారి పోరాటం, ఆధారాలు అంటున్నారు కానీ ఆ పోరాటం ఎందుకో క్లియర్ గా చెప్పరు, ఆధారాలు ఏమిటో స్పష్టంగా చూపించరు. యూనివర్శిటీలో అక్రమాలు జరిగిపోతున్నాయన్నది మనోజ్ ఆరోపణ. విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారనేది ఆవేదన. ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ మీడియా ముందుకు తాను రావడం కాదు .. అలా నష్టపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్ధులని తీసుకొచ్చి ఆక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాన్ని ఎండగడితే దానికో అర్ధం వుంటుంది. అంతేకాని ఎంతసేపు ముసుగులో గుద్దులాటలానే వుంటుంది మనోజ్ తీరు.
నిజానికి మనోజ్ దగ్గర ఏవో బలమైన ఆధారాలే ఉండొచ్చు. ఆయన చెప్పినట్లు అది ఆయన ఆత్మగౌరవానికి సంబధించిన పోరాటం కావచ్చు. ఆస్తులు, పంపకాలు అవన్నీ పర్శనల్. మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టటంత ధైర్యం మనోజ్ లో వున్నట్లు కనిపించడం లేదు. ఆయన వెర్షన్ ఎప్పుడూ కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగానే వుంటుంది.
అయితే మనోజ్ ప్రతిసారి ఇలా మీడియా ముందుకు వచ్చి తనపై ఇన్ని అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పడం కూడా పలచబడిపోవడమే. మనోజ్ దీన్ని ఇంకా డైలీ సీరియల్ లా సాగదీయడం తన కెరీర్ కే మంచిది కాదు. ఆధారాలు వుంటే చూపించి, తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాంటి డొంకతిరుగుడు లేకుండా బయటపెట్టి, న్యాయం కోరి ఈ వివాదాలకు ముగింపు పలికితేనే మళ్ళీ తన నట జీవితానికి కొత్త వెలుగు వస్తుంది.