మంచు మనోజ్ సినిమా చుట్టూ ఓ వివాదం నడుస్తోంది. విశాఖ పట్నంలో మనోజ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టు ఏజెంట్లకూ నిర్మాతకూ ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. నిర్మాత, మనోజ్ కలసి తమని కొట్టారని కొంతమంది ఏజెంట్లు విశాఖపట్నం పరిధిలోని ముత్యాలమ్మ పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మనోజ్ కూడా స్పందించాడు. ”మేం ఎవ్వరినీ కొట్టలేదు. మద్యం మత్తులో జూనియర్ ఆర్టిస్టు ఏజెంట్లే మామీద దాడి చేశారు. అందరి ముందూ నిర్మాతని కొట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. విషయం ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయాలివి. దీనిపై ఇంత రాద్దాంతం చేయడం అనవసరం. ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలి. దీనిపై పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా” అని మనోజ్ తెలిపాడు.
ఈ వ్యవహారంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా సీరియస్ అవుతోంది. ఈ సంఘటనలో తమ నిర్మాతకు న్యాయం జరిగే వరకూ ఊరుకొనేది లేదని, ఈ విషయం తేల్చేంత వరకూ అసలు విశాఖపట్నంలో షూటింగులే జరపమని హెచ్చరించింది. విశాఖలో చిత్రసీమను వృద్దిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉదతంతం పంటికింద రాయిలా తగిలినట్టే. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.