ఏహీరో అయినా.. ఏదో ఓ ఇమేజ్ కోరుకొంటాడు. క్లాసో, మాసో, ఫ్యామిలీ హీరో అనో ఏదో ఓ ముద్ర పడాల్సిందే. యువ హీరోలు కూడా మాస్ హీరోలైపోదామని ఎదురుచూస్తుంటారు. అయితే మంచు మనోజ్ మాత్రం నాకు ఎలాంటి ఇమేజ్లూ వద్దూ అంటున్నాడు. మనోజ్ హీరోగామారి పదేళ్లు దాటేసింది. హిట్ సినిమాలు చేసినా.. ఎలాంటి ఇమేజూ అందుకోలేదు. ఇమేజ్ లేదన్న బాధ ఏమూలనైనా ఉందా? అని అడిగితే… ”అబ్బే.. నేనసలు ఇమేజ్ల గురించి పట్టించుకోను.. నాకు అలాంటివి వద్దు కూడా. మనపై ఏ రకమైన ముద్ర లేకపోతే.. అప్పుడు మరింత స్వేచ్ఛగా పనిచేస్తాం. నేను కొత్త కొత్త పాత్రలు ఎంచుకోవాలంటే ఇమేజ్ అడ్డొచ్చేది. అలాంటి బాధేం లేదు” అంటున్నాడీ హీరో.
అయితే.. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు మనోజ్ కాస్త భారీగానే చేశాడు. కరెంటు తీగ లాంటి కథలు ఎంచుకోవడానికి కారణం అదే. కానీ వర్కవుట్ అవ్వలేదు. అందుకే.. ఇప్పుడు ఇమేజ్ గిమేజ్ వద్దూ అంటూ కొత్త డైలాగ్ అందుకొన్నాడు. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత మనోజ్ కామెంట్ల విషయంలో మరోసారి రుజువైంది కదూ. ఎనీవే మనోజ్ నటించిన ఎటాక్… రేపే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొన్నామధ్య శౌర్య సినిమాతో ఫ్లాప్ తగిలించుకొన్న మనోజ్… వర్మ పుణ్యమా అని కాస్త తేరుకొంటాడేమో చూడాలి.