పవన్ కల్యాణ్ పోరాటంలో నేనూ ఉంటా.. అంటూ మంచు మనోజ్ముందుకొచ్చారు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతానని, అందుకోసం ఓ కమిటీ పనిచేస్తుందని పవన్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీటుకు సర్వత్రా మంచి స్పందనే వస్తోంది. సినీ, సినీతర రంగం నుంచి పవన్‌కి మద్దతు లభిస్తోంది. ఇప్పుడు మంచు మనోజ్ కూడా పవన్‌కి మద్దతుగా గళం విప్పారు. ”పవన్ అన్న పోరాటంలో నేనూ పాలుపంచుకుంటా” అంటూ ఫేస్బుక్ ద్వారా తన సందేశం పంపారు. చిత్రసీమని సినిమా అమ్మ అంటూ అభివర్ణిస్తూ ఓ లేఖ రాశారు మనోజ్. అందులో ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న విషయాలపై తన వైపు నుంచి స్పందన తెలియజేశారు. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని, కాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలోనే లేదని, అన్ని రంగాల్లోనూ ఉందని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమా పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని, త్వరలోనే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు మనోజ్. మీడియా ఇలాంటప్పుడే కాస్త సంయమనం పాటించాలని, వార్తల్లో కాస్త డిగ్నిటీ చూపించాలని కామెంట్ చేశాడు మనోజ్.