మంచు ఇంట్లో కలహాలు, ఆస్తి తగాదాలూ మళ్లీ బయటకు వచ్చాయి. మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం దాడి చేసుకొని, పోలీసు ఫిర్యాదుల వరకూ వెళ్లారు. మనోజ్ అయితే గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో అసలు నిజానిజాలు బయటకు రావాల్సివుంది.
తాజా పరిణామాలు చూస్తుంటే మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తన విషయంలో ఏం జరిగిందో ఆయన కూలంకుశంగా మీడియాకు చెప్పుకొంటారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరకే మనోజ్ మీడియా ముందుకు వద్దామనుకొన్నారు. కానీ.. సన్నిహితులు సర్దిచెప్పడంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. ఆస్తి పంపకాల వ్యవహారంలో మనోజ్ కు ముందు నుంచీ అసంతృప్తి ఉంది. తనకు ఈ విషయంలో అన్యాయం చేశారని, ఆస్తి మొత్తం విష్ణుకే రాసిచ్చారని మనోజ్ తన స్నేహితుల దగ్గర తరచూ వాపోతూ ఉంటారని తెలుస్తోంది. ఈ కారణంలోనే మనోజ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాయరని, ఆమధ్య సినిమాలకు దూరం అవ్వడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. చాలా కాలంగా విష్ణు, మనోజ్ల మధ్య సంబంధాలు సైతం తెగిపోయాయి. రాకపోకలుకూడా బంద్ అయ్యాయి. కానీ ఆస్తి పంపకాల తాలుకూ వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది. ఇప్పుడు అవి బజారున పడ్డాయి.
మంచు మోహన్ బాబు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరు ముందు వస్తే.. వాళ్లు తమ వాదన బలంగా, తమకు అనుకూలంగా వినిపించుకొనే ఛాన్స్వుంది. అందుకే ‘నువ్వా నేనా’ అన్నట్టు ఈ ఏర్పాట్లు మొదలెట్టినట్టు సమాచారం. ఈ వారంలో పెద్ద బాంబే పేలొచ్చు.