చరణ్ సినిమాకు ఎన్ని అవరోదాలో మనం చెప్పాల్సిన పనిలేదనుకుంట.. బ్రూస్ లీ అపజయం తర్వాత ఎంత తొందరగా తన తర్వాత సినిమాను మొదలెడదామనుకున్న చరణ్ కు సినిమా విషయంలో అంత జాప్యం అవుతుంది. కోలీవుడ్ ‘తని ఒరువన్’ సినిమా చూసి నచ్చిన చరణ్ అష్ట కష్టాలతో ఆ సినిమా హక్కులను సొంతం చేసుకుని సినిమా చేసేందుకు తయారయ్యాడు. కిక్-2 అపజయం అయినా సరే సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో సినిమాను అతని చేతిలో పెట్టాడు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఆ సినిమా విలన్ గురించే..!
తమిళ్ సినిమాలో అరవింద్ స్వామి చేసిన ఆ పాత్రను ఆయన చేత చేయించడానికి తల ప్రాణం తోకకి వచ్చింది మన దర్శక నిర్మాతలకు. అంతకుముందు ఆ ప్రతినాయకుడి పాత్రకు కింగ్ నాగార్జున దగ్గర నుండి మాధవన్ వరకు అందరిని ఓసారి అలా చూసుకుంటూ వెళ్లారు. చిరవరగా అరవింద్ కే 5 కోట్ల భారీ పారితోషికం ఇస్తామని ఒప్పించారని అన్నారు. కాని తెలుస్తున్న కథనాల ప్రకారం ఇంకా చరణ్ తని ఒరువన్ సినిమాకు ప్రతినాయకుడు కుదరలేదట. అరవింద్ స్వామికి భారీగా ఇస్తామన్నా సరే చేయనని అంటున్నాడట.
అందుకే ఆ పాత్రను హీరోగా చేస్తూనే కాస్త నెగటివ్ షేడ్స్ లో నటిస్తున్న మంచు మనోజ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. చరణ్ తని ఒరువన్ సినిమా ప్రతినాయకుడి గురించి వెతుకుతున్నారని తెలుసుకున్న మనోజ్ ఆ సినిమా చూసి నచ్చి ఆ పాత్ర తాను చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది అనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి హీరోగా మోహన్ బాబు ప్రతినాయకుడిగా కొన్ని సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు ఆ దారిలోనే చరణ్ కి మనోజ్ ప్రతినాయకుడు అవ్వబోతున్నాడన్నమాట. అద్భుతంగా అనిపిస్తున్న ఈ కలయిక నిజంగా జరిగితే ఇక సినిమా సూపర్ హిట్ అన్నట్టే.. మీరేమంటారు రీడర్స్..!