మోహన్‌బాబు అంటే పెదరాయుడు.. పెదరాయుడు అంటే మోహన్‌బాబు.
అదో చరిత్ర. ఓ చరిత్ర. అందులో మీరు ఇచ్చిన తీర్పులు.. అద్భుతహా. ఇప్పటికీ గుర్తు పెట్టుకొంటాం.
చిత్రసీమలోనూ మీరు పెదరాయుడు లాంటివాళ్లని, చాలా సమస్యల్ని పరిష్కరించారని మీరూ, మీ వారసులూ ఇది వరకు చాలాసార్లు చెప్పుకోగా విన్నాం. అందులో నిజాలూ లేకపోలేదు.
అన్నింటికంటే ముఖ్యంగా గురువుగారు దాసరి నారాయణరావు తరవాత మీరే అని మీ అభిమానులు చెప్పుకొంటారు.
అయితే ఇప్పుడు మాత్రం మీరు నిజ జీవితంలోనూ పెదరాయుడులా మారాల్సిందే. నిజాయితీగా తీర్పు ఇవ్వాల్సిందే.
మీ ఇంట్లో జరుగుతున్న కలహాలకు మీరు స్వయంగా చెక్ పెట్టాల్సిందే.
ఆస్తి పంపకాల విషయంలో మంచు మనోజ్‌కు అన్యాయం జరుగుతోందని లోకం కోడై కూస్తోంది. అందులో ఎంత నిజముందో మీరే తీర్పు చెప్పాలి.
విష్ణుని ఒకలా, మనోజ్‌ని ఒకలా చూస్తున్నారని మీడియా కూడా భావిస్తోంది. ఈ విషయంలో జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కూడా మీరే.
మనోజ్‌ని బౌన్సర్లతో కొట్టించారని, ఇంట్లోంచి తరిమేశారని, ఆఖరికి మనోజ్ భార్యపై కూడా దాడికి దిగారన్న వార్తలు మీ కుటుంబంపై ఉన్న గౌరవాన్ని, మీ పెద్దరికాన్నీ తగ్గించేవే.
ఈరోజు మనోజ్‌ని పరాయి వాడిలా గేటు బయటే నిలబెట్టేయడం, కనీసం వాచ్మెన్ కూడా మనోజ్ అభ్యర్థనని పట్టించుకోకపోవడం లైవ్ విజువల్స్ లో జనం చూస్తున్నారు.
ఇది ఇంటి సమస్య.. ఇంట్లోనే పరిష్కరించుకొంటాం అని మీరు చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడెందుకు రోడ్డుకెక్కింది? పోలీస్ స్టేషన్ల చుట్టూ, డీజీపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది.? మీ పెద్దరికం నిలబెట్టుకొంటూ, ఈ సమస్యని సామరస్యంగా చక్కబెట్టుకొంటే ఈ వ్యవహారం ఇంతవరకూ వచ్చేదే కాదు.
ఇప్పుడైనా పోయిందేం లేదు. ఏ ఇంట్లో లేవు గొడవలు? ఏ అన్నాదమ్ముల మధ్య లేవు ఆస్తి పంపకాలు? మీ ఇంట్లోనూ ఇంతే అనుకొని… ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టండి. మీలోని… పెదరాయుడ్ని మళ్లీ బయటకు తీసుకురండి.
లేదంటే.. కేవలం మీ పెద్దరికం, మీ తీర్పులు కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం అనుకొనే ప్రమాదం ఉంది.