సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందరూ హిట్ సినిమాలు తీయాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రేక్షకులు కొందరికి మాత్రమే కిరీటం కట్టబెడతారు. అందుకే హిట్ వచ్చినప్పుడు చాలామంది సంబరాలు చేసుకుంటారు. హిట్ సినిమా గురించి, అందులో చేసిన క్యారెక్టర్స్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మంచు విష్ణు మాత్రం హిట్ సినిమాలంటే ఇష్టం లేదని తేల్చేశారు. విష్ణు కెరీర్ టర్నింగ్ పాయింట్ ‘ఢీ’. అందులో బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులకు నచ్చింది. ‘ఢీ’ తర్వాత విష్ణు కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ ‘దేనికైనా రెడీ’. కానీ, ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ విష్ణుకి ఇష్టమైన క్యారెక్టర్స్ కాదు. రామ్గోపాల్ వర్మ తీసిన ‘అనుక్షణం’లో క్యారెక్టర్ ఇష్టమంటున్నారు.
తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన ‘గాయత్రి’ ఆడియోలో విష్ణు మాట్లాడుతూ “నాకు ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ ఇలా చాలా హిట్స్ వచ్చాయి. కానీ, నా దృష్టిలో నాకవి ఇష్టమైన పాత్రలు కాదు. నటుడిగా నేను ఇష్టపడి చేసిన సినిమాల్లో ‘అనుక్షణం’ ఒకటి. ప్రతి నటుడికీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. అది వాళ్లకి మంచి నటుడిగా పేరు అయినా తెస్తుంది లేదా నటన రాదని అయినా నిరూపిస్తుంది. అలా నా జీవితంలో ఒక గొప్ప మలుపుగ నిలిచే పాత్రను ‘గాయత్రి’లో చేశా” అన్నారు.
మనకి ఎలాంటి సినిమాలు ఇష్టం అనేదాంతో పాటు ప్రేక్షకులు మనల్ని ఎలాంటి సినిమాల్లో చూడడానికి ఇష్టపడుతున్నారనే విషయాన్ని గుర్తించడం కూడా ఒక నటుడికి ముఖ్యం అనుకుంట! విష్ణుకి హిట్స్ వచ్చిన ప్రతి సినిమాలో కామెడీ కీ-రోల్ ప్లే చేసింది. ఆయన ఇష్టపడిన సినిమాల్లో సీరియస్ యాక్షన్ తప్ప ఏం లేదు. ‘అనుక్షణం’కి పెట్టిన డబ్బులు వస్తే వచ్చాయి. కానీ, థియేటర్లలో ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది? ఇప్పుడు విష్ణు రూటే సపరేటు అనుకోవాలా?!