మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ ఈసారి అధ్యక్ష పదవి కి పోటీ పడుతున్న అభ్యర్థులు మాత్రం ఇప్పటి నుండే వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ని మీడియా ముందు ప్రవేశపెట్టి ఉన్నారు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ కు బలమైన ప్రత్యర్థి గా పోటీ చేయనున్న మంచు విష్ణు ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తాను పోటీ పడుతున్నట్లు అధికారికంగా నిర్ధారించారు. అయితే ఈ లోగా ఇప్పుడు ఉన్న నలుగురు అభ్యర్థులను కాదని ఐదవ అభ్యర్థి కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. వివరాల్లోకి వెళితే..
మంచు విష్ణు లేఖ:
నటుడు మంచు విష్ణు ఈ సారి మా ఎన్నికలలో పోటీ చేయడానికి తనకు ఉన్న కారణాలు, అర్హతలను ప్రస్తావిస్తూ ఒక లేఖ విడుదల చేశారు ఈ లేఖలో ఆయన ” ఈ సంవత్సరం జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమ నే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమా తోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్ట నష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను. నా తండ్రి మోహన్ బాబు ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడి గా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చాను. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారం తో అమలు చేశాను. ‘మా’ వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్త గా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. అందుబాటు లో ఉంటాం ” అని రాసుకొచ్చారు. అయితే ఈ లేఖలో మంచు విష్ణు, ఎప్పుడూ అందుబాటు లో ఉంటాం అన్న వ్యాఖ్యలను ప్రత్యేకించి ప్రస్తావించడం ద్వారా ప్రకాష్ రాజ్ కి చురకలు అంటించారు అన్న అభిప్రాయం పరిశ్రమ లో వెల్లడి అవుతోంది. అదే విధంగా మన ఇంటిని మనమే చక్కదిద్దు కుందాం అన్న వ్యాఖ్యలు కూడా ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదన్న విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేస్తున్నాయి అన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది.
పోటీ లోకి అయిదవ అభ్యర్థి:
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధం గా ఈసారి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, ల తో పాటు జీవిత, హేమ కూడా ఈ సారి బరిలో ఉన్నారు. అయితే తాజా గా మరొక నటుడు సీవీయల్ నరసింహ రావు తను ఈ ఏడాది మా అధ్యక్ష ఎన్నికల లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడి చేశారు. స్వతహా గా లాయర్ అయిన నరసింహా రావు పలు సినిమాలలో లాయర్ పాత్రలను పోషించారు.
మొత్తం మీద ఇప్పటికి ఐదుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు అయింది. మరి ఇక్కడితో ఆగుతారా లేక మరి కొంత మంది బరిలోకి దిగుతారా అన్నది వేచి చూడాలి