కాస్టింగ్ కాల్ అనే మాట తరచూ వినేదే. ఓ సినిమా మొదలయ్యేటప్పుడు కొత్త నటీనటులు కావాలనుకొంటే చిత్రబృందం కాస్టింగ్ కాల్ ప్రకటిస్తుంది. ఉత్సాహవంతులైన వాళ్లు, తమ ప్రతిభని నిరూపించుకోవాలని కోరుకొనేవారూ ఈ కాస్టింగ్ కాల్ ని ఓ వేదికగా భావిస్తారు. ‘స్పిరిట్’ సినిమా కోసం కూడా చిత్రబృందం ఇలానే ఓ ప్రకటన చేసింది. వయసుతో సంబంధం లేదని, ఆసక్తి ఉన్నవాళ్లంతా తమ వివరాలు పంపాలని కోరింది. ఈ కాస్టింగ్ కాల్ చూసి కథానాయకుడు విష్ణు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విష్ణు స్వయంగా ప్రకటించారు. చిత్రబృందం నుంచి వచ్చే స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రకటించారు విష్ణు.
విష్ణు సుదీర్ఘకాలంగా చిత్రసీమలో హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు హిట్లున్నాయా, లేవా? అనేది పక్కన పెడితే – కాస్తో కూస్తో పేరు – పలుకుబడి ఉంది. కుటుంబ నేపథ్యం ఉంది. నిర్మాత కూడా. ‘కన్నప్ప’ అనే చిత్రాన్ని వంద కోట్లతో నిర్మిస్తున్నారు. అన్నింటికి మించి ‘మా’ అధ్యక్షుడు. అలాంటి ఓ హీరో.. ఓ సినిమాలో పాత్ర కోసం, ఓ కొత్త నటుడిలా దరఖాస్తు చేసుకోవడం విష్ణులోని స్పోర్టింగ్ స్పిరిట్ కి నిదర్శనం. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చినా చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఆ సినిమా క్రేజ్ అలాంటిది. విష్ణు కూడా..అలానే భావించి ఉండొచ్చు. పైగా ఈతరం ఆలోచనలు మారుతున్నాయి. పెద్ద సినిమాలో మంచి వేషం దక్కితే హీరోతో సమానం అనుకొంటున్నారు. అందుకే విష్ణు ఇలా ఆలోచించి ఉండొచ్చు. పైగా ప్రభాస్ తో విష్ణుకు మంచి స్నేహం ఉంది. ‘కన్నప్ప’లో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు కూడా. ఆ స్నేహం కొద్దీ.. విష్ణు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. చూద్దాం… సందీప్ రెడ్డి వంగా విష్ణుని ఆడిషన్స్ కి పిలుస్తాడో, లేదో?!