నా మనసుకు దగ్గర అయిన విషయం రేపు పన్నెండు గంటలకు చెబుతానని మంచు విష్ణు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పుడు అంతా అల్లు అర్జున్ షో నడుస్తూ ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. సైలెంట్ గా విష్ణు తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అదేమిటంటే.. తాను హాలీవుడ్ సినిమాల్లో అక్కడి సూపర్ స్టార్ విల్ స్మిత్ తో కలిసి పని చేయబోతున్నారట. ఇందు కోసం తరంగా వెంచర్స్ అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థకు 50 మిలియన్ల డాలర్ల ఫండింగ్ ఉందని విష్ణు చెబుతున్నారు.
ఈ సంస్థలో నిర్మించే ఓ ప్రాజెక్టులో కలసి పని చేసేందుకు విల్ స్మిత్ తో చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని విష్ణు చెబుతున్నారు. విల్ స్మిత్ తో సినిమానే కాకుండా యాభై మిలియన్ డాలర్లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, ఏఆర్, వీఆర్, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడి పెడతామని చెబుతున్నారు. ఈ సంస్థలో ఇంకా ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారో కూడా వివరించారు. ఈ పేర్లలో వినయ్ మహేశ్వరి కూడా ఉన్నారు. ఆయన పేరు ఇటీవల మంచు కుటుంబ వివాదాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈ తరంగా స్టార్టప్‌ను మన దేశంతో పాటు డెలావేర్ లోనూ రిజిస్టర్ చేశారు. ఈ వెంచర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టార్టప్‌లకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, స్ట్రాటజిక్ మెంటార్షిప్ ను కూడా అందిస్తుందని చెబుతున్నారు. కుటుంబ వివాదాల గొడవల్లో ఉన్న మంచు విష్ణు పూర్తిగా దుబాయ్ కు మకాం మారుస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భారీ ప్రాజెక్టు ప్రకటన కాస్త హాట్ టాపిక్ గా మారిందని అనుకోవచ్చు.