`మా` బిల్డింగ్ కి సంబంధించి మంచు విష్ణు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యయమంతా తాను భరిస్తానని విష్ణు ముందుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. `మా` బిల్డింగ్ కి అయ్యే ఖర్చులో తన కుటుంబం 25 శాతం భరిస్తుందని విష్ణు ఇది వరకే చెప్పారు. అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకుని, ప్రతీ పైసా తానే ఇస్తానని ముందుకు రావడం విశేషం.
`మా బిల్డింగ్` వ్యవహారం చాలా యేళ్లుగా నడుస్తోంది. `మా`కంటూ సొంత భవనం లేదు. `మా`కి తగిన స్థలం కేటాయించాలని ఎప్పటి నుంచో పరిశ్రమ అడుగుతోంది. కానీ.. ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ప్రభుత్వం ఓ స్థలం కేటాయిస్తే, ఆ స్థలంలో ఓ భవనం కట్టాలని `మా` అనుకుంటోంది. ఇప్పుడు భవన నిర్మాణానికి అయ్యే ఖర్చంతా విష్ణునే భరిస్తాడు కాబట్టి.. ఓ సమస్య తీరిపోయినట్టైంది. ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుని స్థలం కేటాయిస్తే – ఇక `మా బిల్డింగ్` ఓ కొలిక్కి వచ్చినట్టే. ఎలాగూ విష్ణు భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు భరిస్తాడు కాబట్టి.. ఆ స్థలం కూడా.. హీరోలంతా తలా చేయి వేసి కొనేస్తే – అసలు సమస్యే ఉండదు. కానీ… మన హీరోలు విష్ణు అంత ఔదార్యం చూపిస్తారా? అనేదే డౌటు.
* పోటీ నుంచి తప్పుకుంటా
`మా` అధ్యక్ష స్థానం కోసం మంచు విష్ఱు కూడా పోటీ పడుతున్నాడు. ఈసారి ప్రకాష్ రాజ్ కూడా బరిలో నిలబడడంతో.. పోటీ గట్టిగా ఉంటుందనుకుంటున్నారంతా. అయితే విష్ణు తాజా నిర్ణయంతో.. ఓట్లన్నీ విష్ణుకే పడే ఛాన్సుంది. ఈసారి… ఎన్నికల గొడవ ఉండకూడదని, మా అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతోంది. నిజంగా చిత్ర సీమలోని పెద్దలంతా ఓ నిర్ణయం తీసుకుని, ఏక గ్రీవంగా ఒకరిని ఎంచుకుంటానంటే.. తాను పోటీ నుంచి తప్పుకుంటానని విష్ణు పేర్కొన్నారు. పోటీ ఉంటే మాత్రం తాను.. బరిలో ఉంటానని స్పష్టం చేశారు.