మంచు హీరోల పరిస్థితేం బాలేదు. మోహన్ బాబు నటించిన `సన్నాఫ్ ఇండియా` ట్రోలర్స్‌కి తప్ప ఎవరికీ పనికి రాలేదు. విష్ణు సినిమా `జిన్నా`దీ అదే పరిస్థితి. మనోజ్ అయితే సినిమాలే చేయడం మానేశాడు. మోహన్ బాబు ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు.కాస్తో కూస్తో సీరియస్ గా ట్రై చేస్తోంది విష్ణునే. `జిన్నా` ఫ్లాప్ అయినా… ఇప్పుడు వరుసగా సినిమాలు చేసి, ఏదోలా నిరూపించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు విష్ణు. `జిన్నా` ఫ్లాప్ పక్కన పెట్టి, తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రభుదేవాతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ప్రభుదేవాతో సంప్రదింపులు కూడా మొదలెట్టాడట. `జిన్నా`లోని ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశాడు. ఆ సమయంలోనే… ప్రభుదేవాతో సినిమా చేయాలన్న ఆలోచన బయటపెట్టాడు విష్ణు. ప్రభుదేవా కూడా కొంతకాలంగా మెగా ఫోన్ పట్టలేదు. విష్ణుకి తగిన కథ దొరికితే… తను రెడీనే. అయితేప్రభుదేవా రీమేక్ కథలని ఎక్కువగా నమ్ముకొంటాడు. విష్ణు కూడా వివిధ భాషల నుంచి అరడజను సినిమాల రీమేక్ రైట్స్ సొంతం చేసుకొన్నాడు. వాటిలో ఓ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.