మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దాడి ఘటన జరగిన తర్వాత మంచు విష్ణు ఏం జరగలేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ తెర వెనుక మాత్రం ఇంకా వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడి ఘటన జరిగిన జల్పల్లిలోని నివాసం నుంచి సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ ను మంచు విష్ణు తన వ్యాపారభాగస్వామి ద్వారా స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ లో ఉన్న విష్ణు హుటాహుటిన హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంటి చుట్టూ తన మనుషుల్ని కాపలా పెట్టారని చెబుతున్నారు.
మనోజ్ ఇంటికి ఇవాళ మరోసారి పోలీసులు వెళ్లనున్నారు. మనోజ్ స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ లోపు మరోసారి ఆయన ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఉంది. అయితే వివాదాన్ని సెటిల్ చేసుకుందామనో లేకపోతే మనోజ్ ను బెదిరిద్దామనుకున్నారో కానీ.. సీసీ ఫుటేజీని కనిపించకుండా చేయాలని చూశారు. దీనిపై మనోజ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం కుటుంబపరమైనది కావడంతో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు.
మోహన్ బాబు ఈ విషయంలో అసలేం జరిగిందో క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతోంది. తన సోషల్ మీడియా ద్వారా అయినా ఆయన ఓ ప్రకటన చేయాల్సి ఉంది. ప్రతి ఇంట్లో ఉండే వివాదాలేనని.. తమ ఇంట్లోనూ ఉన్నాయని ఇటీవల జగన్ చేసిన ప్రకటనలకు తగ్గట్లుగా ఓ ప్రకటన చేస్తే సరిపోతుందన్న సలహాలు కూడా వస్తున్నాయి.