“మా” వివాదాలు అంతకుంతకూ పెరుగుతున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబు ప్రెస్మీట్ పెట్టి నేరుగా మెగా క్యాంప్నే టార్గెట్ చేశారు. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు నేరుగా చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చారు. “మా” అధ్యక్షుడి పదవి ఏకగ్రీవం అవడానికి తనను పోటీ నుంచి వైదొలగాలని సూచించారని ప్రకటించారు. తాను బయటకు చెప్పదల్చుకోలేదని.. కానీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్నానన్నారు. ఇది టాలీవుడ్లో మరింత సెగ రాజేసే అవకాశం కనిపిస్తోంది.
మోహన్ బాబు కూడా దాదాపుగా అదే స్థాయిలో స్పందించారు. తాను అసమర్థుడిని కాదని తనను రెచ్చగొట్టాలని చూశారని ఆయన వ్యాఖ్యలు చేశారు. “మా”కు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. నాగబాబు, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా వంటి వారితో పాటు మరి కొంత మంది ముందు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విష్ణు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ అవడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికయిన కార్యవర్గంపై కొంత మందికి తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఎన్నికల్లో పోటీ సందర్భంగా గెలుపు కోసం ప్రచారం చేసిన అంశాలు కానీ.. ఎదుటి వారి మీద చేసిన ఆరోపణలు కానీ.. విమర్శలు కానీ .. వెంటనే మర్చిపోయేవి కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి అంటే..అంతకంత పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా… గెలుపోటములు వదిలి పెట్టి కలసి పని చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.