`మా` ఎన్నికల పుణ్యమా అని – టాలీవుడ్ మళ్లీ చీలిపోతోంది. ఎవరికి వాళ్లు ప్రెస్ మీట్ పెట్టేసుకుంటున్నారు. వీడియో బైట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. `ఎలక్షన్లని సీరియస్ గా తీసుకోవద్దండీ…` అంటూనే వాళ్లు సీరియస్ గా ప్రచారాలు చేసేసుకుంటున్నారు. తాజాగా విష్ణు ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. `జైలుకి వెళ్లి ఊచలు లెక్కపెట్టాల్సినవాళ్లు కూడా నీతులు మాట్లాడుతున్నారు` అంటూ… పరోక్షంగా కామెంట్లు చేశాడు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినవో స్పష్టంగా తెలికయ పోయినా – కచ్చితంగా `మా` ఎన్నికలలో పోటీ చేస్తున్న ఒకరి గురించి అనేది మాత్రం ఖాయం.
విష్ణు మరో మాట కూడా అన్నాడు. `ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది` అని. ఇదే మెగా కాంపౌండ్ కి నచ్చడం లేదు. చిరంజీవి గత కొంతకాలంగా పరిశ్రమ కి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇదివరకెప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు టాలీవుడ్ లో ఇటీవలే జరిగాయి. దానంతటికీ కారణం.. చిరంజీవినే. మురళీమోహన్ లాంటి అనుభవజ్ఞులు కూడా `దాసరి స్థానం చిరంజీవిదే` అని చెబుతుంటే.. విష్ణు ఈ మాట అనడం… సరికాదనిపిస్తోంది. `ఇండ్రస్ట్రీలో పెద్దవాళ్లు ఏం చెబితే అది చేస్తా. పోటీ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటా` అని అంటూనే `పెద్ద దిక్కు లేకుండా పోయింది` అని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదు. దాసరి కుటుంబానికీ… మోహన్‌బాబు కుటుంబానికీ ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బహుశా దాసరి స్థానంలో చిరుని ఊహించుకోవడం విష్ణుకి కష్టంగా ఉందేమో..? అంతే కాదు.. ప్రకాష్ రాజ్ వెనుక చిరు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. బహుశా.. ఆ కోణంలోనూ విష్ణు ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటాడు. మొత్తానికి ఆమధ్య పోటీ నుంచి తప్పుకుంటా.. మా బిల్డింగ్ కట్టేస్తా.. అని సుతిమెత్తగా మాట్లాడిన విష్ణు ఇప్పుడు మాత్రం గళం పెంచాడు. పోటీ తప్పదన్న హింట్ వచ్చిందేమో మరి..?!