మంచు విష్ణు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ దర్శకుడు. ఈ చిత్రానికి ఓటర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ఇంట్రస్ట్రింగ్గానే ఉంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి ఈ కథ ఏమిటి? ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? అనే విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా రాబట్టింది తెలుగు 360.కామ్.
ఈ సినిమాలో హీరో ఓ ఎన్ ఆర్ ఐ. ఎన్నికల సమయంలో అమెరికా నుంచి పనిగట్టుకొని ఇండియా వస్తాడు. ఇక్కడ తన సొంత ఊర్లో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తాడు. తీరా అమెరికా వెళ్లాక.. సొంత నియోజక వర్గంలో ఎమ్మెల్యే పనులేం చేయడం లేదని, ప్రజా సంక్షేమం పేరిట పధకాలన్నీ తన సొంత అవసరాల కోసం వాడుకొంటున్నాడని అర్థమవుతుంది. అంతే అమెరికా నుంచి తిరిగొస్తాడు. ఇక్కడి ఎమ్మేల్యే తాట తీస్తాడు. నేను నీకు ఓటు వేసిన ఓటర్ని… నిన్ను ప్రశ్నించే అధికారం నాకుంది అంటూ నిలదీసిపనులన్నీ చేయించుకొంటాడు. అదెలా?? అన్నదే ఈ సినిమా స్టోరీ. కథ బాగానే ఉంది. టైటిల్ కూడా పర్ ఫెక్ట్ గా సెట్టయిపోయింది. మరి మంచు విష్ణు కూడా కథకు తగ్గట్టుగా రాణిస్తే.. నిజంగా హిట్టు పడే ఛాన్సులున్నాయి. మరోవైపు ఆచారి అమెరికా యాత్ర అంటూ ఓ కొత్త సినిమా మొదలెట్టాడు విష్ణు. అది కూడా ఇంట్రస్టింగ్ కథే. మొత్తానికి కథల ఎంపికలో విష్ణు ధోరణి కాస్త మారినట్టు అనిపిస్తోంది. విష్ణు అందుకోబోయే విజయాలకు ఇది శుభసూచికమేమో.