మంచు విష్ణు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమాలోని స్టార్లు, ఆ హడావుడి చూస్తుంటే విష్ణు మంచి కసితోనే ఈ సినిమా తీస్తున్నాడని అనిపించింది. ఈసారి ట్రోలర్స్ కు పెద్దగా పని పెట్టడేమో అనే నమ్మకం వచ్చింది. అయితే.. ఈ సినిమా కోసం విష్ణు అనుసరిస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రం అంత ఆకట్టుకొనేలా సాగడం లేదు. ఈ సినిమాలో దాదాపు 20 మంది హేమా హేమీలైన నటీనటులు ఉన్నారు. వాళ్లందరి ఫస్ట్ లుక్లూ చిత్రబృందం వరుసగా విడుదల చేస్తోంది. అయితే అందులో ఒక్కటి కూడా ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకొనే స్థాయిలో లేదు. నిన్నటికి నిన్న.. ‘పిలక – గిలక’ అంటూ సప్తగిరి, బ్రహ్మానందం పాత్రల్ని పరిచయం చేశారు. వాళ్ల అవతారాలూ, ఆ పాత్రలకు పెట్టిన పేర్లు చూస్తుంటే… ఈ సినిమాలో దర్శకుడు బీసీ కాలంనాటి కామెడీ ట్రాకుని తెచ్చిపెట్టాడేమో అనే భయం వేస్తోంది. ఇప్పటి వరకూ ‘కన్నప్ప’పై పెంచుకొంటూ వచ్చిన పాజిటీవ్ వైబ్రేషన్స్ కి చిత్రబృందమే కావాలని తగ్గించుకొంటుందేమో అనిపిస్తోంది. వంద కోట్ల సినిమా అంటూ విష్ణు ప్రచారం చేస్తున్నారు. ఆ క్వాలిటీ మేకింగ్ లో కనిపించడం లేదు. ఆమధ్య విడుదల చేసిన టీజర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు ‘శివయ్యా’ అంటూ విష్ణు ఇచ్చిన రియాక్షన్ మళ్లీ ట్రోలింగ్ కు దారి తీసింది.
విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా భావించి తీస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నాడు. అయితే ఆ కష్టం స్క్రీన్ పై కనిపించినప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అదే ‘కన్నప్ప’లో కొరవడింది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. డిసెంబరులో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. పుష్ష 2, గేమ్ ఛేంజర్ ఈ సీజన్లో విడుదల కాబోతున్నాయి. వాటి మధ్య వస్తున్న సినిమా కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదట బయటకు వచ్చే ప్రమోషన్ కంటెంట్ విషయంలో ఒకటికి పదిసార్లు క్వాలిటీ చెక్ చేయాలి. లేదంటే విష్ణు కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవ్వడం ఖాయం.