సాధారణంగా హిట్ కాంబినేషన్‌తో సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. కానీ, మంచు విష్ణుకి రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మంచు విష్ణు హీరోగా సినిమా తీయడానికి ముందు వెనుక ఆలోచించుకోవలసిన పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. విష్ణు హీరోగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలు నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. దాంతో ముచ్చటగా మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ మొదలైంది. ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా విడుదల పలు కారణాల చేత వాయిదా పడింది. ఎప్పుడు విడుదలవుతోందో హీరో, దర్శకుడు కూడా చెప్పలేని పరిస్థితి. అదే నెక్స్ట్ వీళ్ళిద్దరూ చేయబోయే సినిమా మీద పడుతోందని ఫిల్మ్ నగర్ గుసగుస.
షెడ్యూల్ ప్రకారం ‘ఆచారి అమెరికా యాత్ర’ ఈపాటికి విడుదల కావాలి. జనవరిలో విడుదల చేయాలనుకున్న సమయంలోనే నా తదుపరి సినిమా కూడా విష్ణు హీరోగా వుంటుందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఆచారి ఆగడంతో కొత్త సినిమాకు సరైన నిర్మాత సెట్ కావడం లేదట. ‘దేనికైనా రెడీ’ సినిమాను మంచు విష్ణు సొంత ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించారు. ‘గాయత్రి’ విడుదల తర్వాత కొన్ని రోజులు సినిమా ప్రొడక్షన్ కి మంచు ఫ్యామిలీ దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. అందుకని, సొంత ప్రొడక్షన్ హౌస్ కాకుండా బయట నిర్మాతల కోసం చూస్తున్నారు. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు విష్ణు, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో సినిమా తీయడానికి సిద్ధంగా వున్నారు. ఒకవేళ ‘ఆచారి అమెరికా యాత్ర’కి సమస్యలు ఎదురైనట్టు నిర్మాతల వల్ల కొత్త సినిమాకి సమస్యలు వస్తే? అందుకని నిర్మాత విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట. ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలైతే తప్ప కొత్త సినిమా కసరత్తులు ఓ కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు.