మేం గెలిస్తే `మా` బిల్డింగ్ కట్టిస్తాం.. అనే ప్రతిపాదన మీదే.. ఈసారి `మా` ఎన్నికలు జరగడం, అందులో విష్ణు గెలవడం తెలిసిన విషయాలే. అయితే `మా` ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి `మా` బిల్డింగ్ పై ఎలాంటి అప్ డేట్ లేకుండా పోయింది. ‘మూడు స్థలాలు చూశా. అందులో ఏదో ఒకటి డిసైడ్ చేస్తా’ అని విష్ణు చెప్పడం మినహా.. ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేయలేదు. ఈసారి `మా` బిల్డింగ్‌పై మరోసారి కామెంట్ చేశాడు విష్ణు. ఆరు నెలల్లో `మా` బిల్డింగ్‌కి భూమి పూజ జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. అదెక్కడ? అనేది త్వరలో చెబుతానంటున్నాడు విష్ఱు.
ఈమధ్య టికెట్ రేట్ల వ్యవహారంలో పెద్ద రచ్చ జరిగింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు అమాంతం తగ్గించడం వల్ల… చిత్రసీమ బాగా ఇబ్బంది పడింది. ఈ విషయంలో చాలామంది తమ గొంతు వినిపించారు. ఆ సమయంలో `మా` ప్రెసిడెంట్ అయ్యుండి మంచు విష్ఱు ఏం మాట్లాడలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు దీనిపై ఆయన స్పందించారు. ”అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారని చాలా గోల చేశారు. ఇప్పుడు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచింది. ఇప్పుడు ఇది కూడా ఇబ్బందిగా పరిణమించింది అంటున్నారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో గమనించే ఈ విషయంపై నేను స్పందించలేదు..” అని చెప్పుకొచ్చాడు విష్ణు.