ఇది వరకు మంచు విష్ణు చాలా బొద్దుగా ఉండేవాడు. ఆ తరవాత… సిక్స్ ప్యాక్ చేసే స్థాయికి వచ్చాడు. కమర్షియల్ హీరోలకు సరిపడా ఎత్తూ బరువూ సంపాదించుకొన్నాడు. ఇప్పడు మళ్లీ ఓ పదిహేను కిలోల బరువు పెరగాలని నిర్ణయించుకొన్నాడట. అదీ… ఓ పాత్ర కోసం. విష్ణు కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అడ్డా దర్శకుడు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కోసం కండలు పెంచాల్సివస్తోందట. అందుకోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగాలని నిర్ణయించుకొన్నాడట. ఇప్పటికే 5 కిలోలు బరువు పెరగాడని, మరో పది కిలోల బరువు పెరగాల్సివుందని తెలుస్తోంది.
ప్రస్తుతం విష్ణు బరువు 92 కిలోలు. అంటే త్వరలోనే సెంచరీ చేస్తాడన్నమాట. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. విష్ణు బరువు పెరగడం ఒకే. అయితే తమ్ముడు మనోజ్ మాత్రం అర్జెంటుగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. కరెంటు తీగ కోసం కాస్త బొద్దుగా మారిన మనోజ్.. ఆ తరవాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. శౌర్య, ఎటాక్లలో మరీ లావుగా కనిపించాడు. ప్రస్తుతం గుంటూరోడు చిత్రంలో నటించాడు మనోజ్. అందులో అయితే మరీ బొద్దుగా కనిపిస్తున్నాడు. అందుకే మనోజ్ బరువు తగ్గడంపై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అంటే.. అన్న పెరుగుతోంటే, తమ్ముడు తగ్గడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. మరి ఈ ఇద్దరి ప్రయత్నాల వల్ల .. లుక్కులు ఎలా మారబోతున్నాయో.. ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి