అక్టోబరు 5న దసరా. ఈ సందర్భంగా రెండు బడా సినిమాలు వస్తున్నాయి. ఒకటి.. గాడ్ ఫాదర్, రెండోది ఘోస్ట్. వీటితో పాటు స్వాతిముత్యం అనే ఓ చిన్న సినిమా కూడా వస్తోంది. రెండు బడా సినిమాల మధ్య స్వాతి ముత్యం ఏమైపోతోందో అనుకుంటుంటే… ఇప్పుడు ‘జిన్నా’ కూడా వీటిపై ఎటాక్ ఇవ్వబోతున్నాడు. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన సినిమా ‘జిన్నా’. పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ కథానాయికలు. ఇటీవలే టీజర్ వచ్చింది. ఇదో హారర్ కామెడీ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. మంచు విష్ణుకి చాలా కాలంగా హిట్లు లేవు. ఈమధ్య పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. చాలా కాలం తరవాత చేసిన జిన్నాని దసరా బరిలో, అందులోనూ గాడ్ పాదర్ కి పోటీగా వదులుతున్నాడు.
మెగా – మంచు అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లది టామ్ అండ్ జెర్రీ రిలేషన్. మొన్న ‘మా’ ఎన్నికలలో ఎలా పోటీ పడ్డారో చూసేశారంతా. ఇప్పుడు ఆ పోటీ బాక్సాఫీసుకి పాకింది. నిజానికి చిరంజీవి సినిమా వస్తోందంటే – పోటీ పడడానికి బడా హీరోలు సైతం భయపడతారు. కానీ విష్ణు మాత్రం ధైర్యం చేస్తున్నాడు. ఫలితాలు ఎలా వున్నా.. పోటీ విషయంలో జిన్నా గట్స్ని మెచ్చుకోవాల్సిందే.